రహస్య ప్రాంతాలకు హఫీజ్, అజార్

15-11-2026 | 07:38am

ఆపరేషన్ సిందూర్ భయం.. హఫీజ్, మసూద్‌లను రహస్య ప్రాంతాలకు తరలించిన ఐఎస్ఐ!

న్యూఢిల్లీ: పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులకు కూడా భద్రత కరువైందా? భారత్ నుంచి ముప్పు పొంచి ఉందనే ఆందోళనతో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను(most wanted terrorists) పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అత్యంత రహస్య ప్రాంతాలకు తరలించినట్లు భారత నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్(Hafiz Saeed, founder of Lashkar-e-Taiba), జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌లను గత వారం రోజుల వ్యవధిలోనే ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య తరలించినట్లు సమాచారం.

ఈ పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. నిఘా వర్గాల అంచనాల ప్రకారం.. హఫీజ్ సయీద్‌ను లాహోర్‌లోని నివాసం నుంచి రావల్పిండిలో సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని గ్యారిసన్ గ్రౌండ్ ప్రాంతానికి మార్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మసూద్ అజార్‌ను సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాలో ఉన్న అత్యంత పటిష్ఠమైన సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. వీరిపై గుర్తుతెలియని వ్యక్తుల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని పాక్ భద్రతా వ్యవస్థ ఆందోళన చెందుతున్నట్లు భారత వర్గాలు భావిస్తున్నాయి.

ఆపరేషన్ సిందూర్ తర్వాత పెరిగిన టెన్షన్!

2025 మేలో భారత సాయుధ బలగాలు చేపట్టిన Operation Sindoor తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల భద్రతపై ఆందోళనలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ దాడులు నిర్వహించింది. బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్ స్థావరం కూడా దెబ్బతింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమ కీలక నేతలకు ఎలాంటి ప్రమాదం ఎదురుకాకుండా ఐఎస్ఐ ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రికార్డెడ్ ఆడియోతోనే సందేశాలు.. కదలికలకు బ్రేక్!

తరలింపు తర్వాత ఈ ఇద్దరు ఉగ్రవాద నేతలు బహిరంగంగా కనిపించడం, తమ కార్యకలాపాల్లో నేరుగా పాల్గొనడం తగ్గించినట్లు సమాచారం. ముఖ్యంగా హఫీజ్ సయీద్ తన అనుచరులతో ప్రత్యక్షంగా మాట్లాడకుండా ముందుగా రికార్డ్ చేసిన Audio Messages ద్వారా సందేశాలు పంపుతున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయని తెలుస్తోంది. తమ ఆచూకీ బయటపడకుండా ఉండేందుకే ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విశ్లేషిస్తున్నారు.

పాక్ వాదనలకు భారత నిఘా వర్గాల కౌంటర్!

మరోవైపు ఈ అంచనాలు పాకిస్థాన్ అధికారిక వాదనలకు భిన్నంగా ఉన్నాయి. టెర్రర్ ఫైనాన్సింగ్(Terror Financing) కేసుల్లో శిక్ష పడటంతో హఫీజ్ సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నాడని పాక్ చెబుతోంది. మసూద్ అజార్ ఆచూకీ తెలియడం లేదని, అతడు ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లి ఉండవచ్చని పేర్కొంటోంది. అయితే భారత నిఘా వర్గాలు ఈ వాదనలను అంగీకరించడం లేదు. ఇద్దరూ జైల్లో లేరని, ఐఎస్ఐ రక్షణలోనే ఉన్నారని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన ఉగ్రవాద నేతల విషయంలో నిజాలను దాస్తోందా? అన్న ప్రశ్నలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

మరిన్ని వార్తలు