మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

14-11-2026 | 10:10pm

హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవితో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన (Drug Eradication) లక్ష్యంగా చేపడుతున్న ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి హాజరుకావాలని చిరంజీవిని సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కిషన్ రెడ్డి తన అధికారిక సోషల్ మీడియా ఖాతా (Social Media Account) ద్వారా వెల్లడించారు.

యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటంతో పాటు, తెలంగాణ సహా దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భారీ వాక్‌థాన్ (Walkathon) నిర్వహించనున్నట్లు తెలిపారు.

డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో చిరంజీవి భాగస్వామ్యం కావడం ద్వారా యువతలో మరింత అవగాహన కల్పించవచ్చని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చిరంజీవికి సమాజంలో ఉన్న ఆదరణ ఈ ఉద్యమానికి మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు