ఉత్తమ లఘుచిత్రం యక్షగానం

18-10-2026 | 05:25am
  1. బతుకమ్మ పాటల్లో ప్రథమ బహుమతి పొందిన సింగర్ వరం 
  2. అట్టహాసంగా ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ వేడుక

‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా 5 కేటగిరీల్లో ప్రతిభ కనబర్చినవారికి శనివారం అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతోపాటు ఈ అవార్డుల జ్యూరీ కమిటీ బాధ్యులు వెన్నెల గద్దర్, హరీశ్ శంకర్, సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, నల్గొండ గద్దర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్స్, పాటలు, జానపద గీతాలు, వ్యాసాలు, ఇన్‌ఫ్లూయెన్సర్స్ అంశాల్లో గెలుపొందిన 35 మందిని సత్కరించారు. 

విజేతలు.. షార్ట్ ఫిల్మ్స్ విభాగంలో.. 

‘యక్షగానం’ అనే లఘుచిత్రానికి గాను రామ్ తలావాకు రూ.3 లక్షల నగదు, గోల్డ్ మెమొంటో అందజేశారు. ‘నా ఇంటి బతుకమ్మ’ షార్ట్ ఫిల్మ్‌కు గాను అభినవ్ సందబోయిన అవార్డు గెలుచుకున్నారు. ఆయనకు రూ.2 లక్షల నగదు, సిల్వర్ మెమొంటో దక్కింది. ఇక ‘ఇల్లు వెలుగు’ అనే లఘు చిత్రంతో మూడో స్థానంలో నిలిచిన ప్రభువన్ రాజ్‌కు రూ.లక్ష నగదు, రజత పతకం పతకం అందజేశారు. ‘గాయం’ (శేఖర్ గంగనమోని), ‘అమ్మ లాలన’ (వేణుగోపాల్), ‘పాత ఊరిలో కొత్త సూపర్ మ్యాన్’ (బానాల చరణ్), ‘జమ్మి చెట్టు’ (విరించి పుట్ల), ‘ఒగ్గు డోలు (వీరస్వామి కర్రె) ప్రాజెక్టులకు కన్సోలేషన్ బహుమతులు దక్కాయి.

బతుకమ్మ పాటల విభాగంలో.. 

సింగర్ వరం ప్రథమ బహుమతి (రూ.3 లక్షలు), అశ్విని రాథోడ్ ద్వితీయ (రూ.2 లక్షలు), మనీషా పాటిల్ దొడ్లె తృతీయ బహుమతి (రూ.లక్ష) సొంతం చేసుకున్నారు. రామిడి సతీశ్, అభినవ్ వారాలలకు కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. 

జానపద గీతాల కెటగిరిలో.. 

‘వన్ రాంగ్ స్టెప్’ పాటకు గాను డాక్టర్ కుమారస్వామికి మొదటి బహుమతి (రూ.3 లక్షలు), ‘అమ్మ నవ్వింది’ పాటకు గాను శ్రీను ముదిరాజ్‌కు రెండో బహుమతి (రూ.2 లక్షలు), ‘ఇది మాయేనా’ పాటకు గాను వంశీ చారికి మూడో బహుమతి (రూ.లక్ష) అందజేశారు. ‘డప్పుల మేళం కొట్టుకో’ పాటకు గాను మూసిని కనక శివానికి కన్సోలేషన్ ప్రైజ్ దక్కింది. 

ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియో కేటగిరీ: 

‘పెత్తరమాస’ వీడియోకు గాను ప్రసాద్ హైద్రబోయినికి రూ.లక్ష నగదు, గోల్డ్ మెమొంటో, ‘ప్రజా పాలన ప్రభుత్వ పథకాలు’కు గాను హరిణి ఎం రూ.50 వేల నగదు, సిల్వర్ మెమొంటో అందుకోగా, మూడోస్థానంలో నిలిచిన ‘హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ’ వీడియోకు గాను పిట్టల శ్రావణ్‌కు రూ.30 వేల నగదు, జ్ఞాపిక అందజేశారు. ఇక ప్రభుత్వ పతకాలపై వ్యాసాల విభాగంలో..

వినీల కాంత్ కుమార్ నామవరపు (శీర్షిక: వెయ్యి రోజుల వెలుగు రేఖలు)కు మొదటి బహుమతి (రూ.లక్ష), పిల్ల పద్మ యాదవ్ (శీర్షిక: హైదరాబాద్..హైడ్రా)కు రెండో బహుమతి (రూ.50 వేలు), బెన్‌రాజ్ బాకారం (శీర్షిక: మా అమ్మ మహాలక్ష్మి అయ్యింది)కి మూడో బహుమతి (రూ.30 వేలు) పొందారు. ఈ విభాగంలో మరో ఆరుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. 

ప్రజా చైతన్యానికి యువ దర్శకులు కదలాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డ్స్ వేడుకలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. “బతుకమ్మ పండుగలో రంగురంగుల పూలు ఎలా విరబూస్తాయో, యువ ఫిలిం మేకర్స్ జీవితాలు కూడా విజయాలతో అలా వికసించాలి. ప్రస్తుతం తెలంగాణకు చెందిన పలువురు దర్శకులు, హీరోలు, నిర్మాతలు చిత్ర పరిశ్రమలో తమ ప్రతిభను చాటుతున్నారు. సినిమా వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించే సాధనంగా మారాలి.

ముఖ్యంగా రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులు, సూపర్ ఎల్‌నినో ప్రభావాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షపాతంలో మార్పులు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ నిర్వహించడం అభినందనీయం. యువ దర్శకులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

సీఎం రేవంత్ రెడ్డికి కళలు, సృజనాత్మకత పట్ల ఆసక్తి ఉంది. ఆయన స్వయంగా ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నందున కళారంగంలోని ప్రతిభను ప్రోత్సహించే ప్రయత్నాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. యువతలోని ప్రతిభను గుర్తించి, అవకాశాలు కల్పించడం ద్వారా తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దర్శకులు, కళాకారులు ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది” అన్నారు. 

మరిన్ని వార్తలు