పెళ్లయిన హీరోయిన్లు ఆ సీన్లు చేయొద్దా?!

13-11-2026 | 05:35am

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9లో తన భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ఆమె సందడి చేసింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, కెరీర్, సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు, సోషల్ మీడియాలో ఎదురైన విమర్శల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా ‘టాక్సిక్’ సినిమాలో తన ఇంటిమేట్ సీన్లపై వచ్చిన విమర్శల గురించి కియారా స్పందించింది. పెళ్లయిన మహిళా నటులు అలాంటి సన్నివేశాల్లో నటించకూడదన్న వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించింది.

“పెళ్లయిన మహిళా నటీమణులు ఇంటిమేట్ సీన్లలో నటించకూడదని విమర్శించే వారికి నేను చెప్పేది ఒక్కటే.. గెట్ గ్రో అప్. ఇలాంటి విమర్శలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. అయితే ఈసారి చాలామంది సోషల్ మీడియాలో ఈ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించడం చూసి సంతోషించాను. అందుకే నా నిర్ణయాలను సమర్థించుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు” అని కియారా వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఈ విషయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా స్పందన గురించి కూడా ఆమె వెల్లడించారు. “సిద్ధార్థ్ ఈ విషయాన్ని అసలు పట్టించుకోలేదు.

ఆయన నుంచి వచ్చిన ఆ ప్రశాంతమైన స్పందనే నాకు ధైర్యాన్నిచ్చింది. ఈ విషయం గురించి మేమిద్దరం ప్రత్యేకంగా మాట్లాడుకోలేదు కూడా” అని చెప్పారు. దీనికి సిద్ధార్థ్ కూడా స్పందిస్తూ.. “అవును.. మేమిద్దరం ఈ విషయం గురించి చర్చించుకోలేదు” అని స్పష్టం చేశారు. మరోవైపు తన సినిమా ‘టాక్సిక్’ బాక్సాఫీస్ ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘మొదటి రోజు చాలా బాధగా అనిపించింది. కానీ ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం సంతోషాన్నిచ్చింది’ అని కియారా పేర్కొంది. మాతృత్వం, కెరీర్‌ను సమన్వయం చేసుకోవడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి కూడా ఆమె మాట్లాడింది.

‘ఈ రెండు ప్రపంచాలను ఎలా సమన్వయం చేసుకోవాలి? ఎప్పుడూ అపరాధ భావనకు గురికాకుండా ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. తల్లిగా మారిన తర్వాత ఈ మామ్ గిల్ట్ అనేది సహజంగానే ఉంటుంది’ అని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇలా కియారా తన వ్యక్తిగత జీవిత విషయాలతో పాటు, మహిళా నటీమణులపై సమాజం విధించే పరిమితులపైనా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించింది. 

మరిన్ని వార్తలు