జతగూడే ఏడేడు జన్మల బంధం..
ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. ‘రామాయణం(Ramayana)’ పేరుతో వెండితెరపై భారీ స్థాయిలో ఆవిష్కరిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జతగూడె’ పాట విడుదలైంది. ‘జతగూడే ఏడేడు జన్మల బంధం.. విశ్వమే కన్న కలయేగా సీతా సీతా రామ్.. వరమాలే వేసేను వైదేహి రఘునందనకి సీతా సీతా రామ్..’ అంటూ సాగుతోందీ గీతం. శ్రీరాముడు, సీతమ్మ కళ్యాణంలోని మధురమైన క్షణాలను ఈ పాటలో చూపించారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ పాటకు రాకేందు మౌళి తెలుగు సాహిత్యాన్ని అందించగా, శిరీష భాగవతుల ఆలపించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఈ ఎపిక్‌లో మొదటి భాగం 2026 నవంబర్ 5న విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్వీసీ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.