దర్శకుడిగా మారబోతున్నా..
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Bollywood star hero Ranbir Kapoor) త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నారు. ఒక పక్క హీరోగా వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, మెగాఫోన్ పట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇటీవల తన తాజా చిత్రం ‘రామాయణ: పార్ట్ 1(Ramayana: Part 1)’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో(Interview) రణబీర్ తన దర్శకత్వ ప్రణాళికల(Director's plans) గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “నటుడిగా నాకు ఇది చివరి దశాబ్దం. 50 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత నటనకు ముగింపు పలకాలనేది నా వ్యక్తిగత నిర్ణయం.
వచ్చే పదేళ్ల కాలంలో అత్యుత్తమ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం. ఆ తర్వాత నా దృష్టిని పూర్తిగా సినిమా నిర్మాణం, దర్శకత్వంవైపే మళ్లిస్తా. రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాల్లో దర్శకుడిగా నా మొదటి సినిమాను పట్టాలెక్కించాలని యోచిస్తున్నా. దీనికోసం కొన్ని నెలల క్రితమే ఒక స్క్రిప్ట్ రాయడం కూడా ప్రారంభించా. నా తొలి చిత్రంలో నేను హీరోగా నటించను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్’ లేదా దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ చిత్రాల తరహాలో ప్రేక్షకులను నవ్విస్తూ, ఆలోచింపజేసే ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించాలన్నదే నా కోరిక.
స్క్రిప్ట్ రాసే ప్రక్రియ నేను అనుకున్నంత సులువు కాదు, చాలా సవాలుతో కూడుకున్నది. కథలను సృష్టించే రచయితలు, దర్శకులపై ఈ అనుభవంతో నాలో గౌరవం మరింత పెరిగింది” అని రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలైన ’రామాయణ’ (దర్శకత్వం: నితేష్ తివారీ), సంజయ్ లీలా భన్సాలీ ’లవ్ అండ్ వార్’, అలాగే సందీప్ రెడ్డి వంగా ’యానిమల్ పార్క్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత ఆయన పూర్తిస్థాయిలో మెగాఫోన్ పట్టేందుకు సన్నద్ధం కానున్నారు.