రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు!
నితేశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి(Actress Sai Pallavi) సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నవంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ ఏంజిల్స్(అమెరికా)లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ప్రదర్శన జరిగింది. అక్కడి అకాడమీ మ్యూజియంలో జరిగిన రెడ్ కార్పెట్ ఈవెంట్లో స్టార్ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు, వివాదానికి తెరలేపాయి. రావణుడి పాత్రపై ఆమె చేసిన విశ్లేషణ హాట్ టాపిక్‌గా మారింది.
ప్రీమియర్ అనంతరం రెడ్ కార్పెట్ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ.. “రామాయణం అనేది ఒక పవిత్ర గ్రంథం. మీరు భగవంతుడిని నమ్మే వారైతే, ఈ కథ ద్వారా మనల్ని మనం అంతరంగికంగా ప్రశ్నించుకోవాలి. మనలో ఉన్న మంచి, చెడులను విశ్లేషించుకోవాలి. నా ఉద్దేశంలో రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు. ఆయనలో ఎంతో జ్ఞానం, మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మనందరిలోనూ ఒక రావణుడు దాగి ఉన్నాడు. ఆ చెడును మనం గుర్తించి, కాలక్రమేణా ఆ తప్పులను సరిదిద్దుకోవడమే అత్యంత ముఖ్యం.
ఈ సినిమా చూశాక ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నా” అని అభిప్రాయపడ్డారు. సాయిపల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు, సినీ ప్రియులు రెండు వర్గాలుగా విడిపోయి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సినిమాలో సీతమ్మ పాత్ర పోషిస్తూ, సీతను అపహరించిన రావణుడిని సాయిపల్లవి ఎలా సమర్థిస్తుందని కొందరు ట్రోలర్స్ మండిపడుతున్నారు. వాల్మీకి రామాయణంలో రావణుడు చేసిన అకృత్యాలను, సాధ్వి అయిన సీతను లంకలో బంధించి పెట్టిన తీరును గుర్తు చేస్తూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు సాయిపల్లవి మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. రావణుడు గొప్ప శివభక్తుడు, వేద పండితుడు, సంగీత విద్వాంసుడు అనే కోణాన్ని మాత్రమే ఆమె ప్రస్తావించిందని, ప్రతి మనిషిలోని అంతర్గత చెడును జయించాలనే తాత్విక సందేశాన్ని మాత్రమే ఆమె ఇచ్చిందని నెటిజన్లు కొందరు ఆమెను డిఫెండ్ చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూల వల్ల వివాదాల్లో నిలిచిన సాయిపల్లవి, ఇప్పుడు ఏకంగా రామాయణం విడుదల ముంగిట రావణుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సినిమా మైలేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.