బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి

14-11-2026 | 04:39pm

జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత

ములుగు, నవంబర్ 14 (విజయక్రాంతి) : బాలల హక్కుల పరిరక్షణకు(Protection of Children's Rights) ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత(District Welfare Officer Premalatha) అన్నారు. శనివారం నిర్వహించిన చిన్నబోయినపల్లి, శివపురం గ్రామ పంచాయతీలలో నిర్వహించిన గ్రామ బాలల సభలకు జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల హక్కుల పరిరక్షణకు(Protection of Children's Rights) ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, పిల్లలకు స్నేహపూర్వకమైన గ్రామాలను నిర్మించడమే ఈ గ్రామ బాలల సభల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

బాలల సంరక్షణ, పోషణ, విద్య, ఆరోగ్యం వారి హక్కుల పరిరక్షణకు గ్రామస్థాయి నుంచే సమిష్టి కృషి అవసరమని తెలిపారు. శివపురం గ్రామ సర్పంచ్ జబ్బ సరోజన మాట్లాడుతూ బాలల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే వారి విద్య, ఆరోగ్యం, భద్రత మరియు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బాలలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగేలా గ్రామస్థులందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్. హరికృష్ణ మాట్లాడుతూ చిన్నారులు సురక్షిత స్పర్శ, అసురక్షిత స్పర్శ మధ్య తేడాలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని, తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఏదైనా ఆపద, వేధింపులు లేదా బాలల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు భయపడకుండా వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు. చిన్నబోయినపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల, గోగుపల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలల దినోత్సవ వేడుకల్లో జిల్లా సంక్షేమ అధికారి పాల్గొన్నారు. చిన్నారుల ప్రతిభను అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమాల్లో రెండు గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు