హామీల మంజూరుతోనే నల్లమలకు రావాలి
- లేదంటే ప్రజలే అడ్డుకుంటారు
- సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ హెచ్చరిక
వంగూరు, నవంబర్ 25: నల్లమల ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) వస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(R.S. Praveen Kumar) విమర్శించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన జీవో నంబర్లు, మంజూరు పత్రాలతోనే నల్లమలకు(Nallamala) రావాలని సీఎంకు సవాల్ విసిరారు. హామీలు నెరవేర్చకుండా వస్తే నల్లమల ప్రజలు అడ్డుకుంటారని హెచ్చరించారు. వంగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్(MLA Jaipal Yadav), ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
వరంగల్ వేదికగా రైతులను, కామారెడ్డి వేదికగా బీసీలను, చేవెళ్లలో ఎస్సీలను, ఇంద్రవెల్లి సాక్షిగా ఆదివాసీలను, సరూర్‌నగర్‌లో యువతను రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి పాలమూరు బిడ్డలను మోసం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులకు ఇందిర సౌర గిరి పథకం(Indira Solar Hill Scheme) కింద సోలార్ పంపుసెట్లు అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. చెంచు సామాజిక వర్గానికి చెందిన రైతులకు సైతం పంపుసెట్లు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు.
అచ్చంపేట రైతులకు పంపుసెట్లు మంజూరు చేసిన పత్రాలతోనే ముఖ్యమంత్రి నల్లమలకు రావాలని డిమాండ్ చేశారు. గిరిజన రైతుల సంక్షేమం కోసం రూ.12,600 కోట్లు ఖర్చు చేస్తామని ఇచ్చిన హామీకి సంబంధించిన జీవోలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీలకు చెందిన ఆరు లక్షల ఎకరాల భూమికి పట్టాలిస్తామని ప్రకటించిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికే సాగునీరు అందించలేదని ఎద్దేవా చేశారు. అచ్చంపేట నియోజక వర్గంలో కనీసం ఒక్క కాలేజీ అయినా ఏర్పాటు చేశారా అని నిలదీశారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ సైతం సీఎం ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలని సూచించారు. వరంగల్‌లో ఓ విద్యాసంస్థల చైర్మన్ పార్టీలో చేరిన మరుసటి రోజే అధికారులను పంపించి విచారణ పేరుతో వేధించడం సిగ్గుచేటన్నారు.