గర్భగుడే అంజన్న ఆస్తి!
- కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధికి నోచుకోని మద్దిమడుగు
- ఆలయ అభివృద్ధికి, రైతులకు అటవీశాఖ అడ్డంకులు
- కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న అంజన్న భక్తులు
- చెంతనే కృష్ణమ్మ.. అయినా గుక్కెడు నీటికి తప్పని కటకట
- అప్పర్ ప్లాట్ గ్రామాల ప్రజలకు తాగు, సాగునీటి తిప్పలు
- సీఎం పర్యటనతో చిగురిస్తున్న ఆశలు
నాగర్‌కర్నూల్, నవంబర్ 25 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాలతో(Telugu states) పాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు(Karnataka, Maharashtra, Kerala, Tamil Nadu) వంటి రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు(devotees) తరలివచ్చే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం. ప్రతి నాలుగు మాసాలకు ఒకసారి నిర్వహించే హుండీ లెక్కింపుల్లో కోట్ల ఆదాయం సమకూరుతున్నప్పటికీ అందులో 25 శాతం గ్రామపంచాయతీకి నిధులు ఇవ్వాల్సి ఉన్న అవి అమలు కాకపోవడంతో ఆలయ పరిసరాలు అభివృద్ధికి నోచుకోక ఆలయ పరిసరాల్లో ముక్కుపుఠాలు అదిరే దుర్వాసన వస్తుందని భక్తులు(devotees) వాపోతున్నారు.
ఆలయ గర్భగుడి మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో మిగతా ఆలయ పరిసరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని వాదన వినిపిస్తోంది. ఫలితంగా కోట్ల ఆదాయం వస్తున్నా ఆలయానికి గర్భగుడి పరిసరాలే ప్రధాన ఆస్తిగా మిగిలాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అటవీశాఖ ఆంక్షలతో అభివృద్ధికి బ్రేక్.!
లక్షలాది మంది భక్తులు వచ్చే ఆలయంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా అటవీశాఖ అనుమతుల సమస్య ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దిమడుగు గ్రామ పంచాయతీకి గ్రామకంఠం భూమి లేకపోవడం, మహిళా సంఘం భవనానికి 2016లో నిధులు మంజూరైనా నిర్మాణం ప్రారంభం కాలేదు. 2024లో మంజూరైన గ్రామపంచాయతీ నూతన కార్యాలయ భవనానికి కూడా అటవీశాఖ అభ్యంతరాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఒక్క ఇటుక కూడా వేయలేని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు.
అమ్రాబాద్ పదర వంటి మండలాల్లో రైతులు కూడా అటవీశాఖ అధికారుల ఒత్తిళ్ళ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ వాటిని కూడా అడ్డుకుంటున్నారని ఫలితంగా గుడారాలు గుడిసెల్లోనే తమ బ్రతుకు వెళ్ళదీస్తున్నామని స్థానిక చెంచు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్ననూరు నుండి మద్దిమడుగు వరకు సింగిల్ లైన్ గతుకుల రోడ్డు కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని భక్తులు, ప్రయాణికులు వాపోతున్నారు. విద్య ఉపాధి, సెల్‌ఫోన్ సిగ్నల్స్ వంటి సమస్యలను మెరుగుపరిచేందుకు కూడా అటవీశాఖ అద్దంకిగా మారిందని వాపోతున్నారు.
కృష్ణమ్మ చెంతనే.. నీటికి కటకట.!
నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ మద్దిమడుగు ఆలయంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. అప్పర్ ప్లాట్ ప్రాంతంలోని చెంచుపెంటలతో పాటు పదర, అమ్రాబాద్ మండలాల పరిసర గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. 500 నుంచి 600 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ ఆధారంగా తాగునీటి పథకాన్ని రూపొందించి ఆలయానికి, పరిసర గ్రామాలకు నీరు అందించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది.
భక్తులకు కనీస సౌకర్యాలేవీ.
ప్రతి కార్తీక మాసంలో మద్దిమడుగుకు భక్తుల తాకిడి భారీగా ఉంటుంది. అయితే ఆలయ పరిసరాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు వంటి కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్నానాలు ఆచరించేందుకు, దుస్తులు మార్చుకునేందుకు తగిన వసతులు లేక అవమానకర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని భక్తులు వాపోతున్నారు. ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన పుణ్యక్షేత్రంలో కనీస వసతులు కూడా కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమ్రాబాద్ లిఫ్ట్ ఇరిగేషన్ కల నెరవేరేనా..
మద్దిమడుగు పరిసర ప్రాంతాల రైతులు పూర్తిగా వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అమ్రాబాద్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా పదర, అమ్రాబాద్ మండలాల రైతులకు సాగునీరు అందించాలన్న డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. కృష్ణా జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని రైతులు కోరుతున్నారు.
నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామిని దర్శించుకోనుండటంతో స్థానికుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆలయ అభివృద్ధికి అటవీశాఖ అనుమతుల సమస్యను పరిష్కరించడం, భక్తులకు కనీస వసతులు కల్పించడం, బ్యాక్‌వాటర్ ద్వారా తాగునీటి సరఫరా, గ్రామ పంచాయతీకి భూమి కేటాయింపు, నిలిచిపోయిన భవన నిర్మాణాలు, అమ్రాబాద్ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చే అంజన్న ఆలయానికి భక్తులకు అవసరమైన కనీస సదుపాయాలు, అటవీశాఖ ఆంక్షలకు పరిష్కారం చూపి అభివృద్ధికి బాటలు వేస్తారా మద్దిమడుగు పర్యటనలో ముఖ్యమంత్రి ఇచ్చే హామీలు కార్యరూపం దాలుస్తాయా అన్నది వేచి చూడాలి.