రూ.95 కోట్లే లెక్కలోకి!
- నాగర్కర్నూల్ జిల్లాలో రూ.250 కోట్ల సీఎంఆర్ మాయం
- తనిఖీల్లో గుర్తించింది రూ.95 కోట్లే!
- మిగతా రూ.154 కోట్ల ధాన్యం ఏమైంది?
- సీఎం సొంతూరిలోనే రూ.28 కోట్లకు పైగా గల్లంతు
- ఇతర రాష్ట్రాలకు తరలించారా? అధికారుల ఆరా
నాగర్కర్నూల్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)(Custom-milled rice) పెద్ద ఎత్తున పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ను.. ప్రభుత్వానికి తిరిగి అప్పగించకుడా స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. 2022 వానాకాలం, యాసంగి సీజన్లలో పీఏసీఎస్, మెప్మా, సెర్ఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అప్పగించారు.
అట్టి ధాన్యాన్ని తిరిగి బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సిన మిల్లర్లు.. రాజకీయ, అధికారుల అండదండలతో ఇతర రాష్ట్రాలకు మళ్లించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో మిల్లర్లకు అప్పగించిన ధాన్యం విలువ సుమారు రూ.250 కోట్లు కాగా, అందులో రూ.95.61 కోట్ల విలువ చేసే ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా రూ.154 కోట్ల లెక్క తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 12 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
మిల్లర్ల వాదన మరోలా..
రైస్ మిల్లుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రైతులకు ధాన్యం విక్రయాల్లో సౌలభ్యం కలుగుతోందని మిల్లర్లు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్క ఏసీకే ధాన్యం కోసం 1083 బస్తాలు వినియోగించాల్సి ఉండగా ఆయా సీజన్ వారీగా పంట దిగుబడి కారణంగా 1200 బస్తాల పైగా వినియోగించాల్సి వస్తుందంటున్నారు.
ఇవేం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. మరోవైపు, పెండింగ్లో ఉన్న ధాన్యం నిల్వలు, సీఎంఆర్ బకాయిల లెక్కలను తేల్చేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతుండటంతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది.
సీజన్ల వారీగా..
* 202 వానాకలం, యాసంగి సీజన్లకు సంబంధించి 10,856 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.
* 2023 వానాకాలం 3,112 మెట్రిక్ టన్నులు, యాసంగిలో 204 మెట్రిక్ టన్నులు బకాయి ఉంది.
* 2024 25 వానాకాలం 88,499 మెట్రిక్ టన్నులు, యాసంగిలో 30,300ల మెట్రిక్ టన్నులు పెండింగ్ ఉంది.
* 2025 వానాకలం, యాసంగి సీజన్లకు సంబంధించి మిల్లర్లకు ప్రభుత్వం అప్పగించిన సీఎంఆర్ ధాన్యం విల్వు 250 కోట్లు. 12 మిల్లులపై క్రిమినల్ కేసులు
ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని సకాలంలో అప్పగించకపోవడంతో, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జిల్లాలోని అచ్చంపేట, కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్ వంటి ప్రాంతాల్లోని మిల్లుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా రూ.95.61 కోట్ల విలువ జేసే ధాన్యం మాయమైనట్లు గుర్తించి, 12 మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనే సుమారు రూ.28 కోట్ల విలువ చేస్తే ధాన్యం గల్లంతవడం కలకలం రేపుతోంది.
అధికారులు ప్రాథమికంగా గుర్తించిన రూ.95.61 కోట్ల ధాన్యంలోనే రూ.45 కోట్ల పైగా విలువ చేసే ధాన్యం లెక్క తేలలేదు. ఈ నెల 15న నాగర్కర్నూల్ మండలం మంతటి గ్రామ శివారులోని మహాలక్ష్మిపారాబాయిల్డ్ రైస్ మిల్ తనిఖీ చేయగా రూ.9.68 కోట్ల విలువచేసే ధాన్యం బస్తాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో 13 మంది వాటాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఆలస్యంతో బరువులో వ్యత్యాసాలు
ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే తనిఖీలు నిర్వహించి, నిల్వలను పర్యవేక్షిస్తే సీఎంఆర్, ఎఫ్సీఐ బియ్యాన్ని గడువులోగా అప్పగించేందుకు అవకాశం ఉంటుందని మిల్లర్లు అంటున్నారు. తనిఖీలు, పర్యవేక్షణలో స్వార్ధం కోసం జాప్యం కారణంగా ఏళ్ల తరబడి నిల్వలు అలాగే ఉండిపోవడంతో ధాన్యం బరువులో వ్యత్యాసం వస్తుందన్న వాదన వినిపిస్తోంది.
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
గతంలో కొందరు మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పెండింగ్ సీఎంఆర్ బకాయిలను సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు మిల్లర్లు కోరుతున్నారు.
కొంతమంది చేసిన తప్పుల వల్ల మొత్తం రైస్ మిల్లింగ్ పరిశ్రమకు నష్టం కలగకూడదని, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనలు పాటించే మిల్లులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.