ఎడమ కాలువ కింద ఎండుతోంది.. కుడి కాలువ కింద పండుతోంది..!
అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది.
సాగర్ గర్భంలో ఏపీ సొరంగం.. సోయిలేని స్థితిలో తెలంగాణ మంత్రాంగం.
మంత్రుల ఆత్మలు చంద్రబాబు వద్ద తాకట్టు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తప్పని పడిగాపులు.
నల్లగొండ విలేకరుల సమావేశంలో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
నల్లగొండ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి) : నాగార్జునసాగర్ ఎడమ కాలువ(Nagarjunasagar Left Canal) కింద తెలంగాణ పొలాలు ఎండిపోతున్నాయని, అదే సమయంలో కుడి కాలువ కింద ఆంధ్రప్రదేశ్ పంటలు(Crops of Andhra Pradesh) పచ్చగా పండుతున్నాయని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి(Gunta Kandla Jagadish Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో(BRS Party Office) శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాల(Krishna waters) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది అని విమర్శించారు. నల్లగొండ రైతుల కళ్లముందే కృష్ణమ్మ నీళ్లు ఆంధ్రోళ్లు కిందికి తరలిస్తుంటే ఈ మంత్రులు ఏం చేస్తున్నారన్నారు.
శ్రీశైలం నీళ్లను దోచుకుపోయారని, ఇప్పుడు సాగర్ నీళ్లపైనా కన్నేశారన్నారు. సాగర్ గర్భంలో ఏపీ అక్రమ సొరంగం తవ్వుతుంటే ఎనిమిది నెలలుగా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆ సొరంగానికి తెలంగాణ అనుమతి ఇచ్చిందా, కేఆర్ఎంబీ అనుమతులు ఉన్నాయా, కేంద్రం ఏం చెబుతోందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న లెక్కలన్నీ అవాస్తవాలని ఆరోపించారు. ఏపీ 290 టీఎంసీలకు పైగా వాడుకుంటే తెలంగాణకు 40 టీఎంసీలు కూడా దక్కలేదని, 128 టీఎంసీలు వాడామని చెబుతున్నారన్నారు.
అదే నిజమైతే ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు తీసుకున్నారో లెక్కలు బయటపెట్టాలన్నారు. దానికి సంబంధించి రాసిన లేఖలు ఎక్కడ ఉన్నాయో జీవో నంబర్లతో సహా ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. డీ-25, డీ-37, డీ-38, డీ-40 కాలువల ఆయకట్టుకు నీళ్లు ఎక్కడని ప్రశ్నించారు. ఆరుతడి పంటలు వేయమంటున్నారని, నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎలా పండించాలని ప్రశ్నించారు. కూరగాయలు పండించాలన్నా నీళ్లు కావాలన్నారు.
కేసీఆర్ హయాంలో చివరి ఎకరం వరకు నీళ్లిచ్చామని, ఎనిమిదేళ్లుగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇచ్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఒక్కసారి కూడా ఉదయసముద్రం అలుగు దుంకలేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారని, మిల్లర్లతో కుమ్మక్కై రైతులను దళారుల చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ వలసల పరిస్థితి తీసుకొచ్చారని, రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క చుక్క నీరు కూడా తీసుకెళ్లనివ్వొద్దని, తెలంగాణ వాటా నీటిని కాపాడాల్సిందేనని, సాగర్‌లో మిగిలిన నీటిని కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంత రైతాంగానికి జరుగుతున్న అన్యాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ మంత్రుల ఆత్మలు చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.