మాక్ పార్లమెంటే మీకు కరెక్ట్
- ప్రధాని పోస్టు కావాలనుకుంటే అదే సరైన స్థానం
- సిక్కుల ఊచకోత జరిగిన రోజే ఢిల్లీలో మీ సభ ఏమిటి?
- రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్
న్యూఢిల్లీ, నవంబర్ 1: సిక్కుల ఊచకోత జరిగిన బాధాకరమైన రోజే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సభ పెట్టుకోవడం ఏమిటని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మండిపడ్డారు. ఇది బాధితుల గాయాలపై కారం చల్లినట్లు ఉందని వ్యాఖ్యానించారు. ఆదివారం చండీగఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు.
‘1984 నవంబర్ 1న ఢిల్లీలో వందలమంది సిక్కులను హత్య చేశారు. ఈ హింసకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అలాంటి విషాదకర ఘటన జరిగిన రోజే ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో ఢిల్లీలో సభ పెట్టుకోవడం దారుణం. ఇది బాధితుల పుండుమీద కారం చల్లినట్లు ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014లో కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక 1984 నాటి అల్లర్ల కేసును తిరిగి ఓపెన్ చేసిందని, హింసలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేసిందని తెలిపారు. నాటి హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను జైలుకు పంపామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలని కోరిక ఉంటే ఆయన మాక్ పార్లమెంట్‌లోనే ఉండిపోవాలని, అంతకుమించి వేరే ఆప్షన్ లేదని అమిత్ షా ఎద్దేవా చేశారు.
ఇండీ కూటమి నిర్వహించిన మాక్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఈ కామెంట్ చేశారు. ‘రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తూ.. అరాచకాన్ని సృష్టిస్తున్నారు. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. ఆయనకు మాక్ పార్లమెంటే కరెక్ట్. ప్రధానిగా ఎదగాలనుకుంటే అదే సరైన స్థానం’ అని అమిత్ షా అన్నారు.