నాగ్‌పూర్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
- సిట్టింగ్ అభ్యర్థి అభిజీత్ వంజారి గెలుపు
- రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో దక్కిన విక్టరీ
- మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇలాకలో పార్టీ అభ్యర్థి సుధాకర్ కోహాలే ఓటమి
నాగ్‌పూర్, అక్టోబర్ 29: మహారాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్(Congress) పార్టీకి కీలక విజయం దక్కింది. నాగ్‌పూర్(Nagpur)లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ, కాంగ్రెస్ అభ్యర్థి అభిజీత్ గోవిందరావు వంజారీ వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇలాకాగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ గెలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం లో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహాలేను వంజారీ ఓడించారు. ఓట్ల లెక్కింపు చివరి దశ వరకు విజయం ఎవరిని వరిస్తుందనే తీవ్ర ఉత్కంఠ కొనసాగగా, రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో 3,271 ఓట్ల ఆధిక్యంతో వంజారీ విజయం సాధించా రు. నాగ్‌పూర్‌లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో, కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ అభిజీత్ వంజారి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థిపై 3,271 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
దీనితో ఆయన నాగ్‌పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమై, గురువారం తెల్లవారుజామున ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్సీ వంజారి 67,231 ఓట్లు సాధించగా, బీజేపీ తరఫున బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కోహలే 63,960 ఓట్లు పొందారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల సొంత పట్టణంలోనే బీజేపీ ఓటమి పాలవ్వడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
వీరిద్దరూ కోహలే గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బుధవారం జరిగిన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి, కోహలే తన కాంగ్రెస్ ప్రత్యర్థి కంటే 4,294 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి, మొదటి ప్రాధాన్యత ఓట్ల పరంగా కోహలే 60,924 ఓట్లు, వంజారి 56,630 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి నితేష్ కరాలే 24,249 ఓట్లు పొందారు. అయితే, ఏ అభ్యర్థికి కూడా విజయం కోసం అవసరమైన కోటా ఓట్లు లభించక పోవడంతో, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాల్సి వచ్చింది. ఎలిమినేషన్ రౌండ్ల అనంతరం, వంజారి మొత్తం 67,231 ఓట్లు సాధించగా, కోహలే 63,960 ఓట్లు పొందారని ఒక సీనియర్ ఎన్నికల అధికారి తెలిపారు.
నాగ్‌పూర్ డివిజన్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిథ్యం వహించారు. ఆయన పలు పర్యాయాలు ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నాగ్పూర్ర్ ప్రాంతం సంప్రదాయంగా బీజేపీకి బలమైన రాజకీయ స్థావరంగా పరిగణిస్తారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సొంత ప్రాంతం కావడంతో పాటు, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండటం ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తుంది. అలాంటి ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో బీజేపీ తన పూర్తి బలాన్ని ఉపయోగించినప్పటికీ ఓటర్లు తమకు మద్దతుగా నిలిచారని అభిజీత్ వంజారీ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కూడా వంజారి, బీజేపీ అభ్యర్థి సందీప్ జోషిని ఓడించారు.