పత్రాలడిగితే టెంపోను తగులబెట్టుకున్న డ్రైవర్

13-11-2026 | 05:00am

కత్తితో బెదిరింపులు, నల్ల జెండా ప్రదర్శన

అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

తూర్పు ఢిల్లీ ఘాజీపూర్ సరిహద్దులో ఘటన

న్యూఢిల్లీ, నవంబర్ 12: వాహనాన్ని తనిఖీ కోసం ఆపి పత్రాలు చూపాలని ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) అడగడంతో చిర్రెత్తుకొచ్చిన డ్రైవర్ ఆగ్రహంతో తన వాహనాన్ని రోడ్డుపైనే తగులబెట్టాడు. అంతేగాక పోలీసులపైకి కత్తిని చూపిస్తూ బెదిరించసాగాడు. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు మినీ గూడ్స్ క్యారియర్ (టెంపో) తనిఖీ కోసం ఆపడంతో ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలో కత్తి, నల్ల జెండాతో బయటికి దిగి పోలీసులను బెదిరించాడు.

దీంతో పోలీసులు అవాక్కై అతని నుంచి దూరంగా వెళ్లి మరింత మంది పోలీసులను రప్పించారు. ఈ లోగా పోలీసులను దుర్భాషలాడుతూ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన వాహనాన్ని తగులబెట్టాడు. సంఘటనా స్థలానికి వచ్చిన మరింతమంది పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే దగ్ధమవుతున్న టెంపో మంటలను ఆర్పివేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని ఘనేందర్‌గా గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు