సభకు ఓకే.. ర్యాలీకి నో

01-11-2026 | 05:15am
  1. నేటి ఇండీ కూటమి నిరసనపై ఢిల్లీ పోలీసుల ఆంక్షలు
  2. అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
  3. కన్నాట్ ప్లేస్ నుంచి మార్చ్ తీయడానికి వీల్లేదని స్పష్టీకరణ
  4. రామ్ లీలా మైదాన్‌లో సభ పెట్టుకోవచ్చని సూచన
  5. పరిసరాల్లో 4వేల మంది బలగాలతో భద్రత
  6. ఢిల్లీ అంతటా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలు
  7. లక్షల మంది తరలివస్తారన్న రాహుల్‌గాంధీ
  8. ఎన్ని ఆంక్షలు పెట్టినా వెనక్కి తగ్గబోమని ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని ఇండీ కూటమి(INDI Alliance) ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనుంది. మింటో రోడ్డు కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, రామ్‌లీలా మైదాన్‌లో బహిరంగ సభ ఉంటుందని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే.. ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. రామ్‌లీలా మైదాన్‌లో మాత్రం సభ పెట్టుకోవచ్చని అనుమతిచ్చారు. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం దేశ రాజధానిలో నెలకొంది. 

లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు

‘ఓట్ బచావో, దేశ్ బచావో’ పేరిట ఇండీ కూటమి ఆధ్వర్యంలో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి లక్షల మందిని తరలించేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు కూటమిలోని పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ‘ఎక్స్’ వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పంచుకుంటున్నారు. ‘ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్డు  కన్నాట్ ప్లేస్ జంక్షన్ వద్ద మనం కలుద్దాం.. అక్కడి నుంచి కలిసి నడుద్దాం. 

అజ్మేరీ గేటు మీదుగా రామ్ లీలా మైదాన్‌కు చేరుకుందాం. భారీ సభలో మాట్లాడుకుందాం’ అని శనివారం కూడా పిలుపునిచ్చారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాటం ఆపబోమని ఆయన తేల్చిచెప్పారు. పది లక్షల మంది వస్తారని ఇండీ కూటమి అంచనా వేస్తున్నది. మరోవైపు ఈ నిరసనలతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, దీపావళి తర్వాత నిర్వహించుకోవాలని రాహుల్ సహా కూటమి నేతలకు స్థానిక వ్యాపారులు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినా.. అనుకున్న ప్రకారమే ఆదివారం నిరసన చేపట్టేందుకు కూటమి సిద్ధమైంది. 

ఆంక్షలతో మరింత టెన్షన్

ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు మింటో రోడ్డు  కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ర్యాలీ చేపట్టేందుకు వీల్లేదని చెప్పడం మరింత టెన్షన్ వాతావరణానికి దారితీసింది. కన్నాట్ ర్యాలీకి ప్రయత్నిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న డీసీపీలు హెచ్చరించారు. కన్నాట్ ప్లేస్ జంక్షన్ సహా జంతర్ మంతర్, ఇతర నిషేధిత ప్రాంతాల్లో ఎవరినీ అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఢిల్లీ అంతటా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 163 అమలులో ఉందని తెలిపారు. రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి సభకు గతంలో ఇచ్చిన అనుమతే ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. ఆంక్షలను పట్టించుకోబోమని, ర్యాలీ చేపడుతామని ఇండీ కూటమి చెప్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నది. 

భారీ భద్రతా

రామ్‌లీలా మైదాన్‌లో ఇండీ కూటమి సభ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు ఆ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000మంది పోలీసులు, పారామిలటరీ దళాలను రంగంలోకి దింపారు. సభ జరిగే ప్రాంతంలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.. చుట్టుప్రక్కల ప్రాంతంలో మరో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటు పోలీసులు బాడీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. కెమెరాలన్నింటినీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు. రామ్‌లీలా మైదానానికి దారితీసే దారులను 14 జోన్‌లుగా విభజించి నిఘాను కట్టుదిట్టం చేశారు.

ప్రతీ జోన్‌ను ఒక సీనియర్ పోలీసు అధికారి పర్యవేక్షించనున్నారు. సమూహాల కదలికలను పర్యవేక్షించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించనున్నారు. ప్రధాన వేదికపై సీనియర్ నాయకుల కోసం, రెండో వేదిక ఇతర వీఐపీ నాయకుల కోసం ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఈ మైదానంలో లక్షమంది పట్టే సామర్థ్యం ఉండగా, 30 నుంచి 50వేల మంది వస్తారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు