సోనియా గాంధీకి ట్రేడర్స్ లేఖ

30-10-2026 | 11:09am

దీపావళి బిజినెస్‌కు రాజకీయ ర్యాలీ అడ్డంకా? రూ.12 వేల కోట్లపై ఆందోళన!

దీపావళి వేళ కాంగ్రెస్‌కు ట్రేడర్ల అల్టిమేటం.. ర్యాలీ వాయిదా వేయాలని డిమాండ్!

న్యూఢిల్లీ, అక్టోబర్ 30: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ రాజకీయ ర్యాలీ ఇప్పుడు వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. నవంబర్ 1న రాంలీలా మైదాన్‌లో జరగనున్న ఈ Mega Rally కారణంగా దీపావళి పండుగ సీజన్‌లో కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని Chamber of Trade and Industry (CTI) ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 10 లక్షల మంది ప్రజలు, వేలాది వాహనాలు నగరానికి తరలివస్తే ఢిల్లీలోని 20 ప్రధాన Commercial Markets కార్యకలాపాలు స్తంభించిపోతాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ర్యాలీని దీపావళి తర్వాత నిర్వహించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి లేఖ రాసింది. నవంబర్ 1న నిర్వహించ తలపెట్టిన ర్యాలీని నవంబర్ 10 లేదా 11వ తేదీకి వాయిదా వేయాలని CTI చైర్మన్ బృజేష్ గోయల్ కోరారు. తాము కాంగ్రెస్ ర్యాలీకి వ్యతిరేకం కాదని, అయితే పండుగ సమయంలో వ్యాపారుల జీవనోపాధికి ఇబ్బందులు కలగకూడదన్నదే తమ అభ్యర్థన అని స్పష్టం చేశారు. నవంబర్ 6న ధన్‌తేరస్, నవంబర్ 8న దీపావళి ఉండటంతో నవంబర్ 1 షాపింగ్, సరుకుల రవాణా, వ్యాపార లావాదేవీలకు అత్యంత కీలకమైన రోజని వివరించారు. ఆ రోజు ర్యాలీ కారణంగా సుమారు రూ.10,000 కోట్ల నుంచి రూ.12,000 కోట్ల వరకు వ్యాపారానికి అంతరాయం కలగవచ్చని అంచనా వేశారు.

పార్కింగ్, ట్రాఫిక్‌పై వ్యాపారుల ఆందోళన

ర్యాలీకి వచ్చే వాహనాల Parking కోసం సరైన ఏర్పాట్లు లేవని CTI పేర్కొంది. రాంలీలా మైదాన్‌లో కనీసం 200 పెద్ద బస్సులకు కూడా సరిపడా పార్కింగ్ సౌకర్యం లేదని తెలిపింది. అలాంటప్పుడు ర్యాలీకి వచ్చే 15 వేల నుంచి 20 వేల బస్సులు, కార్లు, ఇతర వాహనాలను ఎక్కడ నిలిపివేస్తారని ప్రశ్నించింది. వాహనాల రాకపోకలతో జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్, అజ్మేరీ గేట్, చాందినీ చౌక్ రోడ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ Traffic Congestion ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

20 ప్రధాన మార్కెట్లపై ప్రభావం?

రాంలీలా మైదాన్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఢిల్లీలోని సుమారు 20 ప్రధాన Wholesale, Retail Markets ఉన్నాయని వ్యాపార సంఘం తెలిపింది. చాందినీ చౌక్, సదర్ బజార్, కనాట్ ప్లేస్, పాలికా బజార్, జనపథ్, భగీరథ్ ప్యాలెస్, ఖారీ బావోలీ, కశ్మీరీ గేట్, నయా బజార్, చావ్రీ బజార్, కరోల్ బాగ్, గఫార్ మార్కెట్, దర్యాగంజ్ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మార్కెట్ల ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు సరుకులు సరఫరా అవుతాయని, రోజువారీ వ్యాపార లావాదేవీలు రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఉంటాయని CTI వివరించింది. ఈ మార్కెట్లకు ప్రతిరోజూ 56 పారిశ్రామిక ప్రాంతాల నుంచి సుమారు 5 వేల ట్రక్కులు, టెంపోలు సరుకులు తీసుకొస్తాయని తెలిపింది. మరోవైపు ఇక్కడి నుంచి NCRలోని గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, సోనిపట్, పానిపట్ సహా 25 నగరాలకు దాదాపు 3 వేల ట్రక్కుల ద్వారా సరుకులు తరలిస్తారని పేర్కొంది. ర్యాలీ కారణంగా రవాణా వ్యవస్థ దెబ్బతింటే పండుగ సరుకులు మార్కెట్లకు చేరుకోవడమే కాకుండా, ఇతర ప్రాంతాలకు పంపడంలోనూ సమస్యలు ఎదురవుతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ప్రత్యామ్నాయంగా మరో వేదిక సూచన

ర్యాలీకి వచ్చే వాహనాలు అక్టోబర్ 31 నుంచే సింఘు, టిక్రీ, ఘాజీపూర్, బదర్‌పూర్ సరిహద్దుల ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని CTI తెలిపింది. దీంతో ర్యాలీకి ఒక రోజు ముందే సరుకుల రవాణాపై ప్రభావం పడవచ్చని పేర్కొంది. అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద కేవలం 5 వేల నుంచి 7 వేల మంది పాల్గొన్న కార్యక్రమం కారణంగానే మధ్య ఢిల్లీలో దాదాపు ఎనిమిది గంటల పాటు Traffic Jam ఏర్పడిందని గుర్తుచేసింది. ఇప్పుడు 10 లక్షల మంది వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో CTI రెండు ప్రతిపాదనలు చేసింది. మొదటిది.. నవంబర్ 1 ర్యాలీని ధన్‌తేరస్, దీపావళి వ్యాపారాలు ముగిసిన తర్వాత నవంబర్ 10 లేదా 11వ తేదీకి వాయిదా వేయాలి. రెండోది.. ర్యాలీ వాయిదా సాధ్యం కాకపోతే రాంలీలా మైదాన్‌కు బదులుగా సుమారు 15 వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉన్న బురారీ గ్రౌండ్‌కు వేదికను మార్చాలి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గతంలో మూడుసార్లు లేఖలు రాసినా స్పందన రాలేదని బృజేష్ గోయల్ పేర్కొన్నారు. మొత్తంగా, రాజకీయ కార్యక్రమం నిర్వహణకు తాము వ్యతిరేకం కాదని చెబుతున్న ఢిల్లీ వ్యాపారులు.. పండుగ సీజన్‌లో తమ వ్యాపారాలు, సరుకుల రవాణా దెబ్బతినకుండా చూడాలని కోరుతున్నారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకత్వం ఈ విజ్ఞప్తిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


మరిన్ని వార్తలు