చెత్తలోనే బంగారం..

08-11-2026 | 05:25am
  1. దీపావళికి ధూళి కొనుగోలుకు పోటీ
  2. గయాలో రూ.5 లక్షల వరకు ధర

గయా, నవంబర్ 7: దీపావళి వచ్చిందంటే ప్రజలు బంగారం నగలు(Gold jewelry) కొనేందుకు పోటీ పడుతుంటారు. బీహార్‌లోని(Bihar) గయా నగరంలో మాత్రం కొందరు వ్యాపారులు ధూళి, చెత్త కోసం పోటీ పడుతుంటారు. వాటి కోసం లక్షల రూపాయలు వెచ్చించేందుకూ వెనుకాడరు. దుమ్ము, చెత్త కోసం అంత ధర ఎందుకని ఆశ్చర్యపోతున్నారా..? అది మామూలు చెత్త కాదు మరి.. బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణాల్లో బంగారం, వెండి నగలను(Gold and silver jewelry) కత్తిరించడం, చెక్కడం, సానబట్టడం వంటి పనులు చేస్తారు. ఈ సందర్భంగా చిన్ని చిన్న బంగారు, వెండి, రాగి కణాలు కింద పడిపోతాయి. వాటిని సాధారణ చెత్తతో పాటు పారేయకుండా.. ప్రత్యేక పెట్టెల్లో దాచిపెడతారు. దుకాణాల్లో ఏడాది పొడవునా ఇలా పేరుకుపోయే ధూళి, వ్యర్థ పదార్థాలను ‘న్యారా’ అని పిలుస్తారు. 

‘న్యారా’ కోసం పోటాపోటీ

గయా నగరంలో ఉన్న 300-350 ఆభరణాల దుకాణాల్లో ‘న్యారా’ను ఏడాది పొడవునా దాచి పెడతారు. సరిగ్గా దీపావళి, ధన్‌తేరస్ పండుగలకు ముందు ఈ ‘న్యారా’ను విక్రయిస్తారు. వీటిని కొనుగోలు చేసేందుకు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్, బీహార్‌లోని సాసారం, డెహ్రీ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక నైపుణ్యం కలిగిన ‘న్యారీ’ ముస్లిం సమాజానికి చెందిన వ్యాపారులు గయాకు వస్తారు. ‘న్యారా’లో బంగారం, వెండి ఎంత ఉందో అంచనా వేసి వేలం ధరలో కొనుగోలు చేస్తారు. చిన్న దుకాణాదారులకు రూ.25-50 వేలు, మధ్యస్థాయి దుకాణాదారులకు రూ.లక్ష-రూ.2 లక్షలు, పెద్ద దుకాణాదారులకు రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లిస్తారు. ‘న్యారీ’ విక్రయించగా వచ్చిన ఆదాయంలో 12 శాతం ప్రధాన కార్మికులకు, మరో 2 శాతం సహాయ కార్మికులకు యజమాని పంచడం ఆనవాయితీ.

ముస్లింలకూ ఆదాయం

‘న్యారా’ నుంచి తొలుత ధూళి, మట్టి, ఇతర వ్యర్థాలను వేర్వేరు పద్ధతుల్లో శుభ్రపరుస్తారు. ప్రత్యేక శుద్ధి ప్రక్రియల ద్వారా బంగారం, వెండి, రాగి కణాలను వేరు చేస్తారు. లోహ కణాలను ఒకచోట చేర్చి కరిగిస్తారు. మిశ్రమ లోహాన్ని రిఫైనింగ్ చేసి స్వచ్ఛమైన బంగారం, వెండిని పొందుతారు. హిందువుల దీపావళి సందర్భంగా ఒకవైపు స్వర్ణకారులకు ఆదాయం వస్తుంది. మరోవైపు ముస్లింలు అయిన న్యారీ కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రత్యేక సంప్రదాయం మతసామరస్యానికి, పరస్పర ఆర్థిక సహకారానికి ఉదాహరణగా నిలుస్తోంది. 

మరిన్ని వార్తలు