జటాయు కూలిన ప్రదేశం ఇదే?
- రావణుడితో వీరోచితంగా పోరాడి నేలకొరిగిన పక్షిరాజు
- సీతాదేవిని రక్షించే క్రమంలో ప్రాణాలు వీడిన వైనం
- కొల్లాంలో జటాయు ఎర్త్ సెంటర్
కొల్లాం, నవంబర్ 16: కేరళంలోని(Kerala) కొల్లాం జిల్లాలో చడయ మంగళం ప్రాంతం భారత పౌరాణిక చరిత్రలో(Indian Mythological History) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడ సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో ‘జటాయు ఎర్త్ సెంటర్(Jatayu Earth Center)’ను నిర్మించారు. ఈ ప్రాంతంలోని ఒక పెద్ద రాతి కొం డపై భారీ జటాయు(Jatayu) (పెద్ద పక్షి) శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పంగా గుర్తింపు పొందిన ఈ నిర్మా ణం పర్యటకులకు(tourists) ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. శ్రీరాముడి సతీమణి సీతాదేవిని రక్షించేందుకు పక్షిరాజు జటాయువు చేసిన త్యాగానికి ఇది ఒక నివాళిగా నిలుస్తోంది.

జటాయువు రెక్కలు నరికిన రావణుడు
రామాయణం ప్రకారం.. సీతాదేవిని రావణుడు అపహరించి లంకకు తీసుకెళ్తుండగా పక్షిరాజు జటాయు అతడిని అడ్డుకున్నా డు. సీతమ్మను రక్షించేందుకు రావణుడితో భీకరంగా పోరాడాడు. రావణుడిని తీవ్రంగా ప్రతిఘటించడంతో అతను తన ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికివేశాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన జటాయు నేలకొరిగాడు. అయితే.. ప్రాణాలు విడిచే ముందు అక్కడికి చేరుకున్న శ్రీరాముడు, లక్ష్మణులకు సీతాపహరణం గురించి వివరించిన జటాయు.. రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడన్న కీలక సమాచారం అందించాడు. జటాయు త్యాగానికి ముగ్ధుడైన శ్రీరాముడు.. అతడికి అంత్యక్రియలు నిర్వహించి నట్లు రామాయణ గాథలు చెబుతున్నాయి.
తిరువనంతపురంకు 50 కి.మీ.ల దూరంలో..
స్థానిక జానపద కథనాల ప్రకారం.. రావణుడితో పోరాడిన జటాయు చడయ మంగళం ప్రాంతంలోని రాతి కొండపై పడిపోయాడు. అందుకే ఈ కొండను ‘జటాయుపాణ’ అని పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని గతంలో ‘జటాయు మంగళం’ అని పిలిచేవారని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఇక్కడి శ్రీ కోదండరామ ఆలయానికి కూడా జటాయు గాథతో సంబంధం ఉంది. ఈ ఆలయంలో విల్లు ధరించిన కోందడరాముడి రూపంలో శ్రీరాముడు పూజలందుకుంటున్నాడు. ఈ కొండపై కనిపించే ఒక పాద ముద్రను శ్రీరాముడి పాదముద్రగా భక్తులు విశ్వసిస్తారు. ఈ పర్యాటక కేంద్రం తిరువనంతపురం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.