బిల్డర్ల కోసం ప్రజల ఇళ్లు కూలుస్తారా?
- రోడ్డు అలైన్మెంట్ మార్పుతో ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులు
- నార్సింగిలో సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్ కాలనీలవాసులకు అండగా ఉంటాం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
రంగారెడ్డి బ్యూరో/మణికొండ, అక్టోబర్ 31(విజయక్రాంతి): రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగిలో 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్మెంట్ మార్పుతో ఇబ్బందులు పడుతున్న సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్ కాలనీల నివాసితులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) స్పష్టం చేశారు. శనివారం ఆయన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో ఆ కాలనీలలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
హెచ్ఎండీఏ అధికారులు ఇళ్లకు, అపారుటమెంట్లకు వేసిన రెడ్ మార్కింగ్‌లను పరిశీలించి, తీవ్ర ఆందోళనలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. 2013లో ప్రతిపాదించిన 100 అడుగుల రోడ్డు అలైన్మెంట్ వల్ల ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా, ఎంతో ప్రాచీనమైన చారిత్రక హనుమాన్ ఆలయానికి ఎలాంటి విఘాతం కలగకుండా 2018లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నంబర్ 181 ద్వారా అలైన్మెంట్లో తగిన మార్పులు చేసిందని గుర్తుచేశారు.
అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా 2026లో అలైన్‌మెంట్‌ను మార్చడం వల్ల అనేక అపార్టుమెంట్లు, సొంత ఇళ్లు, పాఠశాలలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒకరిద్దరు బడా బిల్డర్ల వ్యాపార ప్రయోజనాల కోసమే దాదాపు 2 వేల అపార్టుమెంట్లలో నివసిస్తున్న 4 వేలకు పైగా అమాయక కుటుంబాలను వీధిపాలు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ భూముల విక్రయం, రోడ్డు అలైన్మెంట్ మార్పుల వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. మార్కెట్ ధర ప్రకారం గజానికి రూ. లక్షకు పైగా విలువ ఉండగా, రూ. 47 వేలకే ప్రభుత్వ భూమిని విక్రయించారని తెలిపారు. అసలు విలువ రూ. 110 కోట్లు ఉన్న భూమిని కేవలం రూ. 26 కోట్లకే ఒక బిల్డర్‌కు అప్పగించారని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సెవెన్ హిల్స్ అపార్ట్మెంటుకు ఇరువైపులా రెడ్ మార్కింగ్‌లు వేయడం వల్ల భవనం స్థిరత్వంతో పాటు సెల్లార్ పార్కింగ్, అండర్‌పాస్, వాకింగ్ ట్రాక్, స్థానిక ఆలయం పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పక్కనే ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లే రహదారిని సైతం అధికారులు పురపాలక చర్యలతో మూసివేయడంతో నిరుపేద కుటుంబాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లేదా రోడ్డు అలైన్మెంట్లో ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే చట్ట ప్రకారం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి బాధితులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని హరీశ్ రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిబంధనలన్నింటినీ గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బాధిత ప్రజలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.