రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు లేదు.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్లో జరుగుతున్న భారత్ సమిట్లో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరైన ఈ అంతర్జాతీయ సదస్సులో దేశ రాజకీయ పరిస్థితులు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయాల్లో పెరుగుతున్న ఆధిపత్య ధోరణులపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
గత పదేళ్లుగా ఫాసిస్టు ధోరణుల గొంతు గట్టిగా వినిపిస్తోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటు ఉండకూడదని, ఇలాంటి ధోరణుల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతింటున్నాయని విమర్శించారు. రాజకీయాలంటే గట్టిగా మాట్లాడటం, ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు చేయడం మాత్రమే కాదని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని రాహుల్ ఆరోపించారు. రాజకీయాల్లోకి భారీ మొత్తంలో డబ్బు ప్రవేశించిందని, దీని ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థపై పడుతోందని అన్నారు. ప్రజల గొంతుకకు, భిన్నాభిప్రాయాలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు.
కొందరి పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ సమిట్కు హాజరుకావాల్సిన కొంతమంది ప్రతినిధులను కేంద్రం అడ్డుకుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి కూడా ప్రజాస్వామ్యంలో సమాన అవకాశం ఉండాలని ఆయన స్పష్టం చేశారు