ఆప్‌కు ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా

02-11-2026 | 05:15am
  1. పంజాబ్ 2027 తొలిజాబితా ప్రకటన మరుసటి రోజే పరిణామం
  2. కేజ్రీవాల్‌కు లేఖ రాసిన జోరామజ్రా, పఠాన్మజ్రాలు

చండీగఢ్, నవంబర్ 1: పంజాబ్‌లో 2027 ఎన్నికల(Elections) కోసం 40 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన మరుసటి రోజే ఆప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పారీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు(MLAs resign) సమర్పించారు. అధినేత కేజ్రీవాల్ తమకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నామని పంజాబ్  పటియాలాలోని సమనా నియోజకవర్గం ఎమ్మెల్యే చేతన్ సింగ్ జోరామజ్రా(Constituency MLA Chetan Singh Jauramajra), సనౌర్ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్మజ్రాలు ప్రకటించారు.

ఆదివారం పార్టీకి రాజీనామాలు సమర్పించిన విషయాన్ని విలేకరుల సమావేశంలో తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ లేఖ రాసినట్లు హర్మీత్ సింగ్ తెలిపారు. సోషల్ మీడియా పోస్ట్‌లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చేతన్ సింగ్ ప్రకటించారు.

2027లో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆప్ 40మంది సిట్టింగ్ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తొలిజాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు అలకబూనారు. పఠాన్మజ్రా గతంలో సొంత ప్రభుత్వ తీరుపైనే పలు ప్రశ్నలు సంధించగా ఉద్రిక్తతలకు దారి తీసి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొన్నారు.

లైంగికదాడి కేసు కూడా ఈయనపై నమోదై జైలుకు వెళ్లి ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈయన రాజీనామాకు ఇది ఒక కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల సన్నాహాల నేపథ్యంలో సమనా నియోజకవర్గానికి తనను సంప్రదించకుండా ఇన్‌చార్జీగా మాజీ మంత్రి సుర్జీత్ షింగ్ రఖ్రాను నియమించడంతో జోరామజ్రా రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు గాను 2022లో ఆప్ 92 స్థానాలను గెలుచుకొని భారీ విజయాన్ని నమోదు చేయగా, కాంగ్రెస్ 18, బీజేపీ రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంది.


మరిన్ని వార్తలు