విద్యుత్ రంగానికి 21,285 కోట్లు
సోలార్ పవర్ ఉత్పత్తికి సర్కార్ ప్రణాళికలు
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌తో పాటు పేద వర్గాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, విద్యా సంస్థలకు కూడా ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది. విద్యుత్ రంగం కేవలం సరఫరా వ్యవస్థగానే కాకుండా సమాజిక న్యాయం, ఆర్థిక వృద్ది, భవిష్యత్‌లో తెలంగాణకు పునాదిగా ప్రభుత్వం భావిస్తోంది.
అందుకు ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు రూ.21,285 కోట్లు కేటాయించింది. కేటాయించిన ఈ బడ్జెట్‌లో నిర్వహణ కోసం రూ.737 కోట్లు, పథకాల అమలు కోసం రూ.20,549 కోట్ల ప్రభుత్వం ప్రతిపాదించింది. గత బడ్జెట్‌లో రూ.21,221 కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్ గత బడ్జెట్ కంటే కేవలం రూ.64 కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,187 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది.
విద్యుత్ డిమాండ్ కూడా ఏటా పెరుగుతోంది. ఈ మార్చి 13న 18,228 మెగావాట్ల డిమాండ్‌కు విద్యుత్ వినియోగం చేరింది. రాష్ట్రంలో గృహజ్యోతి పథకం ద్వారా 53 లక్షల కుటుంబాలు లబ్దిపొందు తున్నాయి. భవిష్యత్‌లో సోలార్ పవర్‌ను మరింత పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్దం చేస్తోంది.




