12 July, 2026 | 2:40 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

మహాపీఠం ఫడ్నవీస్‌దే!

02-12-2024 03:34 AM

మళ్లీ సీఎంగా తిరిగి రాబోతున్నారు

పీటీఐతో బీజేపీ సీనియర్ నేత వెల్లడి

బీజేపీ శాసనసభ పక్ష సమావేశం అనంతరం సీఎం పేరు ప్రకటన 

శ్రీకాంత్ భవితవ్యంపై చర్చించాం.. నిర్ణయించలేదు

మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

ముంబై, డిసెంబర్ 1: మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎంగా మళ్లీ దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైందని బీజేపీ సీనియర్ నేత ఒకరు పీటీఐ వార్తా సంస్థతో ఆదివారం వెల్లడించారు. డిసెంబర్ 2 లేదా 3వ తేదీన జరిగే బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆయననే ఎన్నుకుంటారని, ముఖ్యమంత్రిగా మళ్లీ ఫడ్నవీస్ తిరిగి రాబోతున్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ పరోక్షంగా ఇదే విషయాన్ని వెల్లడించారు.

మహారాష్ట్ర సీఎం ప్రకటనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బీజేపీ శాసనసభ పక్ష సమావేశం సోమవారం జరగనుండగా, అందులో నిర్ణయం తీసుకుంటారని షిండే స్పష్టం చేశారు. 

పదవి ముఖ్యం కాదు

ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత స్వగ్రామం వెళ్లిన షిండే తొలిసారి మీడియాతో ఆదివారం మాట్లాడుతూ సతారాకు వెళ్లిన కారణాన్ని వివరించారు. సుదీర్ఘ ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత వరుస భేటీలతో అనారోగ్యానికి గురయ్యానని, అందుకే స్వగ్రామానికి వచ్చినట్లు షిండే వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుపై అసంతృప్తి చెందానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని షిండే తెలిపారు.

మహాయుతి ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుంది. ఈ విషయంలో మూడు పార్టీల మధ్య సమన్వయం ఉంది. ప్రజలు మాకు భారీ విజయాన్ని కట్టబెట్టారు. మాకు ప్రజలు ఏం ఇచ్చారనే విషయాన్ని పక్కన బెడితే వాళ్లకు మేం చేయాలనేదే ముఖ్యం. వారి అభివృద్ధి కోసం కృషి చేయాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను ముందుకు తీసుకువెళ్లాలి. ఇక సీఎం విషయానికి వస్తే ఎవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు. ఐదో తేదీకి ఇంకా చాలా సమయం ఉంది అని పేర్కొన్నారు. 

కుమారుడి భవితవ్యంపై..

తన కుమారుడు శ్రీకాంత్ షిండేను డిప్యూటీ సీఎం పదవికి పరిశీలిస్తున్నారనే ఊహాగానాలకు సంబంధించి సైతం షిండే స్పందించారు. ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మీడియానే ఇలాంటి చర్చలకు తెరలేపుతోంది. మా పట్ల ఉన్న నమ్మకంతోనే ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఎవరికీ ఏ పదవి వస్తుందనేది ఎప్పటికీ ముఖ్యం కాదు. ఇక ప్రతిపక్షాల గురించి మాట్లాడితే ఓడిపోయినప్పుడే వాళ్లకు ఈవీఎంలు గుర్తుకు వస్తాయి.   

ఇప్పటికే సీఎం పేరు ఖరారు!

మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ప్రకటనపై బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దాన్వే మాట్లాడుతూ.. ఇప్పటికే పేరు ఖరారైందని చెప్పారు. బీజేపీ అధిష్ఠానంతో పాటు కూటమి నేతల నిర్ధారణ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. సీఎం ఎవరనేది మహారాష్ట్ర ప్రజలకు సైతం తెలుసునని వ్యాఖ్యానించారు. సీఎం పేరు ప్రకటన తర్వాత క్యాబినెట్ కూర్పుపై కూటమి నేతలతో చర్చించి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని దాన్వే పేర్కొన్నారు.