13-09-2025 03:40:05 AM
జెన్ జడ్ ప్రతిపాదనను ఆమోదించిన అధ్యక్షుడు, గంటల వ్యవధిలోనే ప్రమాణస్వీకారం పూర్తి
-మార్చి 4న సాధారణ ఎన్నికలు: తాత్కాలిక ప్రధాని
-నేపాల్ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు
-పార్లమెంట్ రద్దును వ్యతిరేకించిన స్పీకర్, చైర్మన్
-ఎమర్జెన్సీ విధించే యోచనలో తాత్కాలిక ప్రభుత్వం!
-నేపాల్‌లో ఇంకా చల్లారని మంటలు
-51కి చేరుకున్న మృతుల సంఖ్య
-హోటల్ నాలుగో అంతస్తు నుంచి దూకి మృతి చెందిన భారత మహిళ..
ఖాట్మాండు, సెప్టెంబర్ 12: నేపాల్ తా త్కాలిక ప్రభుత్వాధినేత ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. నేపాల్‌కు తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి శుక్రవారం నియమితులయ్యా రు. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి పేరును జెన్ జడ్ వర్గం ప్రతిపాదించగా.. అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఆమో దించారు. ప్రధానిగా నియమితులైన గంటల వ్యవధిలోనే కర్కి ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తుంది. నేపాల్ మొట్టమొదటి మ హిళా ప్రధానిగా సుశీలకర్కి రికార్డులకెక్కా రు.
ఈ కార్యక్రమానికి నేపాల్ ఉపాధ్య క్షుడు రామ్ సహాయ్ యాదవ్, ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ సింగ్ రావత్, మాజీ ప్రధాని డాక్టర్ బాబూరామ్ భట్టారాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్, చీఫ్ సెక్రటరీ ఏక్‌నారాయణ్ ఆర్యల్, ఖాఠ్మాండు మేయర్ బాలెన్ షా, ప్రధాన పార్టీల నాయకులు, సుశీలా కర్కి భర్త దుర్గా సువేది తదితరులు హాజరయ్యా రు. 2026 మార్చి 4న నేపాల్‌లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు సుశీల కర్కి ప్రకటించారు. తాత్కాలిక ప్రభుత్వం నేపాల్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సుశీల కర్కిని తాత్కాలిక ప్రధానిగా నియమించడాన్ని మావో యిస్టు పార్టీ వ్యతిరేకించింది. పార్లమెంట్ రద్దు కూడా సరికాదని పేర్కొంది.
ఇది రాజ్యాంగ విరుద్ధం అని, చట్టబద్ధతపై అనేక ఆందోళనలు తలెత్తే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకుడు దేవేంద్ర పౌడేల్ వ్యాఖ్యానించారు. ప్రధానిగా తన పేరు ప్రకటించే కొద్దిసేపటి ముందే సుశీల కర్కి నేపాల్ అధ్యక్షుడు రామచంద్రతో భేటీ అయ్యారు. నేపా ల్ పార్లమెంట్ రద్దుకు జెన్ జడ్ వర్గం పట్టుబట్టగా.. స్పీకర్, జాతీయ అసెంబ్లీ చైర్మన్ సం యుక్త ప్రకటన విడుదల చేసి ససేమిరా అన్నారు. చివరికి పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు నిర్ణయం వెలువరించారు.
ఇకపోతే జెన్ జడ్ నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 51కి చేరుకుంది. యువత హోటల్స్‌కు నిప్పు పెట్టడంతో ఖాట్మాండు నగరం లోని ఓ హోటల్ నాలుగో అంతస్తు నుంచి భయంతో కిందికి దూకిన ఘజియాబాద్‌కు చెందిన రాజేశ్‌దేవి గోలా (57) మృతి చెందినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యంతర ప్రభుత్వాధినేతను ఎన్నుకునేందుకు జెన్ జడ్ వర్గం అనేక తర్జనభర్జనలు పడింది. అనేక మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. గురువారం సుశీలా కర్కి అభ్యర్థిత్వం వద్దని ఘీసింగ్ పేరు తెరపైకి రాగా ఆఖరుకు ప్రధాని పదవి సుశీల కర్కి వశమైంది. అల్లర్ల సాకుతో జైళ్ల నుంచి పారిపో యిన ఖైదీల్లో కొంత మంది స్వచ్ఛందంగా వెనక్కు తిరిగివస్తున్నారు.
అధ్యక్ష కార్యాలయం ముందు నిరసనలు
ఖాట్మాండులోని అధ్యక్ష కార్యాలయ భవనం ముందు జెన్ జడ్ వర్గం సుశీల కర్కి, హర్కా సంపంగ్‌లకు మద్దతుగా గుమిగూడి.. మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో అధ్యక్ష కార్యాలయం వెలుపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్ష కార్యాలయంలోకి చర్చల కోసం ఒక వర్గానికే ఆహ్వానం రావడంపై మరో వర్గం వారు మండిపడ్డారు. పరిస్థితులను గమనించిన నేపాల్ ఆర్మీ వెంటనే రంగంలోకి దిగి ఎటువంటి గొడవ జరగకుండా చూసింది. అధ్యక్ష కార్యాలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అల్లర్ల వీడియోలు పంపండి
అల్లర్లకు సంబంధించిన వీడియోలు మెయిల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగిన అల్లరికి సంబంధించిన వీడియో ఉన్నా పంపిం చాలని కోరారు. దోపిడీలు, లూటీలు చేసిన వారి వివరాలు ఉన్నా పంపాలని అభ్యర్థించారు. అల్లర్లకు సంబంధించిన వీడియో లను పంపేందుకు ఒక ప్రత్యేక మెయిల్ ఐడీని రిలీజ్ చేశారు. జెన్ జడ్ నిరసనల వల్ల నేపాల్‌లోని హోటల్ పరిశ్రమకు రూ. 2500 కోట్ల నష్టం వాటిల్లినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
సిద్ధమైన కార్యాలయం..
జెన్ జడ్ వర్గం ఆందోళనలు, నిరసనలతో ప్రస్తుత నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. ఇక త్వర లో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పడనుం ది. మధ్యంతర నేత కోసం జెన్ జడ్ వర్గం తీవ్రంగా అన్వేషిస్తోంది. మధ్యంతర నేతగా ఎన్నికైన వారు కొత్త ప్రభుత్వాన్ని నడిపేందుకు నూతన కార్యాలయం కూడా సిద్ధ మైంది. అందుకు కావాల్సిన సామగ్రిని కూ డా కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్‌తో మంతనాలు జరిపారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రాజ్యాంగం గురించి న్యాయకోవిదులతో చ ర్చలు జరిపారు.
జెన్ జడ్ వర్గం డిమాం డ్ మేరకు ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ను అ ధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ రద్దు చేశారు. అయితే అంతకు ముందు పార్లమెంట్ రద్దు ను వ్యతిరేకిస్తూ నేపాల్ జాతీయ అసెంబ్లీ చై ర్మన్, స్పీకర్ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. పార్లమెంట్ రద్దును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగ విలువలు కాపా డేందుకు అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ప్రస్తుత పరిస్థితిని రాజ్యాం గ చట్టాల ప్రకారం సద్దుమణిగేలా కృషి చే యాలని దేశంలో ఉన్న విభిన్న పార్టీల నాయకులను వారు అభ్యర్థించారు.
ఎమర్జెన్సీ యోచన
సుశీల కర్కి నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నేపాల్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలి క్యాబినెట్ సమావేశంలోనే తీసుకోనున్నట్టు సమాచారం. ఎమర్జెన్సీ విధింపుతో దేశవ్యాప్తంగా పోలీసుల బలగాలను మోహరించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గం టల నుంచి ఈ ఎమర్జెన్సీ అమల్లోకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎవరీ సుశీలా కర్కి..
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నియమితులైన 72 సంవత్సరాల సుశీల కర్కి నేపాల్ సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన తొలి నేపాలీ మహిళ. డేరింగ్ అండ్ డ్యాషింగ్ మహిళగా కర్కికి పేరుంది. ఉపాధ్యాయురాలిగా కెరీర్ మొదలుపెట్టిన కర్కి అనంతరం లాయర్‌గా మారా రు.
ఎవరికీ భయపడకుండా, ఎవరి ఒత్తిడులకు తలొగ్గకుండా విధులు నిర్వర్తించారు. తన ఉద్యోగ జీవితంలో ఎటువంటి మరకలు లేని వ్యక్తిగా పేరెన్నికగన్నారు. 2009 లో సుప్రీం కోర్టులో అడుగుపెట్టిన కర్కి అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అనేక అవినీతి కేసుల్లో ఎవరూ ఊహించని విధంగా కఠినమైన తీర్పులిచ్చారు.
ఆమె నిర్ణయాల పట్ల మాజీ ప్రధాన మంత్రి కేపీ శర్మ కూడా ఒకానొక సమయం లో అభ్యంతరం వ్యక్తం చేసి.. ఆమెపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అయినా ప్రజల మద్దతుతో ఆ అభిశంసన తీర్మానం కూడా వీగిపోయింది. ఒక న్యాయమూర్తిని తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమించడం నేపాల్ దేశచరిత్రలో ఇదే మొదటిసారి. 1952లో ఓ మధ్యతరగతి నేపాలీ కుటుంబంలో జన్మించిన కర్కి మహేంద్ర మోరాంగ్ కాలేజీ నుంచి 1972లో బీఏలో డిగ్రీ తీసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) నుంచి 1975లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ పట్టాను పొందారు.
అనంతరం త్రిభువన్ యూనివర్సిటీలో చేరి న్యాయవాద విద్య అభ్యసించారు. ఇక 1985లో కర్కి ధరన్‌లో ఉన్న మహేంద్ర మల్టీపుల్ క్యాంపస్‌లో ఉపాధ్యాయురాలిగా చేరారు. పంచాయతీ పాలనను గద్దె దించేందుకు 1990లో జరిగిన ప్రజా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపింది. తన అనుభవాలను రంగరించి ‘కరా’ అనే నవలను ఆమె రాశారు. 2008లో నేపాల్ బార్ అసోసియేషన్‌లో సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. సుప్రీం కోర్టులో మొదట తాత్కాలిక ప్రధానిగా విధులు నిర్వర్తించిన కర్కి.. అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితుల య్యారు. నేపాలి కాంగ్రెస్‌కు చెందిన దుర్గా ప్రసాద్ సువేది అనే వ్యక్తిని కర్కి వివాహం చేసుకున్నారు.
బెనారస్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 1973లో జరిగిన విమాన హైజాకింగ్ ఘటనలో దుర్గా ప్రసాద్ సువేది పేరు ప్రముఖంగా వినిపించింది. నేపాల్ రాజు మహేంద్ర పాలనకు వ్యతిరేకంగా చేసిన సాయుధ పోరాటం కోసం నిధులు సేకరించేందుకే ఈ హైజాకింగ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో దుర్గా ప్రసాద్ సువేది రెండేళ్ల జైలు శిక్ష అనుభవించి అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు.
నాలుగో అంతస్తు నుంచి దూకి భారతీయ మహిళ మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన రాంవీర్ సింగ్ గోలా (60), రాజేష్ దేవి గోలా(57) నేపాల్‌లో ఉన్న పశుపతి నాథ్ ఆలయ సందర్శన కోసం వెళ్లారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హయత్ రీజెన్సీ హోటల్‌లో ఈ దంపతులు గదిని బుక్ చేసుకున్నారు.
సెప్టెంబర్ 9న వీరు బస చేసిన హోటల్‌కు జెన్ జడ్ నిరసనకకారులు నిప్పు పెట్టగా.. ప్రాణాలను కాపాడుకునేందుకు ఈ దంపతులు నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ ఘటనలో రాజేష్ దేవి మృతి చెందగా.. రాంవీర్ సింగ్ గాయపడ్డారు. గాయాలపాలయిన రాంవీర్ సింగ్‌ను సహాయక శిబిరానికి తరలించినట్టు అధికారులు తెలిపారు.