15 August, 2026 | 9:28 PM

బలిదేవత.. తెలంగాణ తల్లి ఎలా?

25-05-2024 12:16 AM

నిజామాబాద్, మే 24 (విజయక్రాంతి): నాడు బలిదేవత అని పేర్కొన్న సోనియా గాంధీ.. నేడు తెలంగాణ తల్లి ఎలా అయ్యిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సోనియా, రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ఉద్యమాన్ని సోనియా అణచివేయాలని చూశారని, యువత మరణాలకు కారణం అయ్యారని ఆరోపించారు. తల్లిదండ్రుల కడుపుకోత చూడలేక బీజేపీ నాయకురాలు సష్మస్వరాజ్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపారని గుర్తుచేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం గోడమీది పిల్లిలా వ్యవహరించి పదవులకోసం పాకులాడరని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణను దోచుకు న్నారని, ఇప్పడు అంతకుమించిన దోపిడి రేవంత్‌రెడ్డి హయాంలో జరుగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ వనరులతో ఢిల్లీకి కప్పం కడుతున్నారని విరుచుకుపడ్డారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, మల్లేశ్ యాదవ్, సుంకరి నారాయణ, ఎర్రం సుధీర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.