28 May, 2026 | 1:37 AM

118 కిలోల కొకైన్ స్వాధీనం

28-05-2026 01:07 AM
  1. గుజరాత్ కచ్ తీరంలో పట్టివేత
  2. సరుకు విలువ రూ.1180కోట్లు, ఇద్దరు అరెస్టు

గాంధీనగర్, మే 27: గుజరాత్‌లోని కచ్ తీరంలో భారత కోస్ట్ గార్డ్ అధికారులు మం గళవారం భారీ ఎత్తున మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. పట్టుకున్న కొకైన్ విలువ రూ. 1,180 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 118 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ఏటీఎస్, కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్‌లో భారత జలాల్లో ఒక కంటైనర్ షిప్‌ను స్వాధీనం చేసుకున్నామని డీజీపీ కేఎల్‌ఎన్ రావు బుధవారం మీడియాకు తెలిపారు.

ఈ ఓడ బ్రెజిల్, లాటిన్ అమెరికా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కరాచీల మీదుగా ప్రయాణించి గుజరాత్ తీరానికి చేరుకుందని చెప్పారు. పోలీసులను చూసి నిందితులు రెండు సంచుల్లో ఉన్న కొకైన్‌ను సముద్ర జలాల్లో పడవేశారని చెప్పారు. అనుమానం వచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నామని, ఓడలో ఇద్దరు నైజీరియన్ జాతీయులు ఉండగా, వారిలో ఒకరు సముద్రంలోకి దూకి తప్పించుకున్నారని వివరించారు. 

అనుమానితులలో ఒకరు, ఆ సరుకును ఢిల్లీలోని ద్వారకలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తులకు అందజేయాల్సి ఉందని వెల్లడించారు. టాంజా నియాకు చెందిన క్లావిన్ చుక్వుమా, బ్యారుహంగా జేగమ్స్ ఉగాండా పౌరుగా గుర్తించామని చెప్పారు. వీరిద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం కూడా ఇదే తీరంలో రూ. 1800 కోట్ల విలువ గల 300 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.