calender_icon.png 12 February, 2026 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాద్‌నగర్‌లో 75.7 శాతం నమోదు

12-02-2026 12:00:00 AM

షాద్‌నగర్, ఫిబ్రవరి 11  (విజయక్రాంతి): షాద్‌నగర్ మున్సిపాలిటీలో బుధవారం జరిగిన ఎన్నికల పర్వం ముగిసింది. స్వల్ప ఉద్రిక్తతల మధ్య ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని మొత్తం 28 వార్డుల్లో కలిపి 75.7 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 53,403 మంది ఓటర్లకు గాను, 40,424 మంది తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. 

ఎన్నికల వేళ పలు వార్డుల్లో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరి ఉద్రిక్తతకు దారితీసింది. 9వ వార్డులో బీజేపీ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.10 వార్డులు లో  కాంగ్రెస్ - బిఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా క్షేత్రస్థాయిలో బందోబస్తు చర్యలను పర్యవేక్షించారు.

డిసిపి శిరీష, ఏసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. మున్సిపల్ ఎన్నికల అధికారి సునీత రెడ్డి పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు.