ఘనంగా మహిళా దినోత్సవం వేడుకలు
తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి) : క్లారా జట్కిన్ ఒక సాంఘీక విప్లవం తేవడం ద్వారా, మహిళల అవసరాలు, హక్కుల గురించి పోరాడడం ద్వారా 1921లో మాస్కోలో జరిగిన 2వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించినట్టు హైకోర్టు జడ్జి మాధవి తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్‌బీ స్టేడియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి బీ.శ్యామ్, మహిళా చైర్ పర్సన్ డా.జీ.దీపారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల టీజీఓ మహిళా ప్రతినిధులు, వివిధ డిపార్ట్‌మెంట్ ఫోరంల ప్రతినిధులు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయురాళ్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ మహిళలు శారీరకంగా, మానసికంగా శక్తివంతులుగా తయారు కావాలని కోరారు. ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు.
అసోసియేషన్ ఎప్పుడూ మహిళలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి, సమస్యలు ఎప్పటి కప్పుడు పరిష్కరిస్తుందని తెలిపారు. బీ.శ్యామ్ మాట్లాడుతూ మహిళలకు మద్దతు ఇవ్వడం అంటే సమాజానికి మద్దతు ఇవ్వడమే అని తెలిపారు. కార్యక్రమంలో టీజీవోస్ సెంట్రల్ మహిళా విభాగపు క న్వీనర్ జే.సుజాత, కోశాధికారి, జీ.శాంతిశ్రీ తదితర మహిళలు పాల్గొన్నారు.




