రోడ్డు విస్తరణ జరిగేనా?
ఇరుకు రోడ్డు గుండానే భారీవాహనాల ప్రయాణం
గుంతలమయంగా మారిన గుండి రోడ్డు
ఇరువైపుల రోడ్డును విస్తరించాలని డిమాండ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని నేషనల్ హైవే రోడ్డును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోకి ప్రవేశించేందుకు మాత్రం అప్రోచ్ రోడ్డు వేయక పోవడంతో వాహనదారులు హైవే వైపు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న రోడ్డు గుండా మంచిర్యాల వైపు వెళ్లాలాంటే రోడ్డు క్రాస్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో వాహనాలు హైవేపైన రోడ్డు క్రాస్ చేసే సమయంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసులు, సంబంధిత అధికారులు యూ టర్న్ మూసివేశారు. గుండి రోడ్డు మార్గం గుండా వెళ్లే ఫ్లు ఓవర్ క్రింది నుంచి మంచిర్యాల వైపుగా వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. హైవేకు వెళ్లేందుకు రోడ్డు వెడల్పు లేక పోవడంతోపాటు మూలమలుపు వద్ద ఇరుకుగా ఉండటం ఇబ్బందికరంగా మారింది. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కింగ్ చేసి మర్చిపోయారు
ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటైన తరువాత రోజురోజుకు జిల్లా కేంద్రంలో రద్దీ పెరుగుతున్నది. గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన వరుణ్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిని 132 ఫీట్లకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు రోడ్డుకు ఇరువైపుల మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసి రెండేండ్లు గడుస్తున్నా రోడ్డు వెడల్పు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. పాత అటవీశాఖ చెక్‌పోస్టు నుంచి జన్కాపూర్ మీదుగా అదిలాబాద్ క్రాస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ చేయాలని నిర్ణయించారు. గతంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేయడం తప్ప పనులకు కార్యరూపం దాల్చడం లేదనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం నుంచి కుమ్రంభీం చౌక్ వరకు మాత్రమే డివైడర్లను ఏర్పాటు చేశారు. ఇంకా రెండు కిలో మీటర్ల వరకు డివైడర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. గుండి మార్గం గుండా ప్రస్తుతం హైవే వైపు వాహనాలను మళ్లించారు. కానీ, రోడ్డు పనులు చేపట్టకపోవడంతో వాహనదారులు, కాలనీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఒత్తిళ్లతో అభివృద్ధికి అటంకం
జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపడితే.. కొన్ని చోట్ల భవనాలను కుల్చాల్సి ఉంది. దీంతో పెద్ద వ్యాపారులు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి రోడ్డు విస్తరణ పనులు జరుగకుండా ఒత్తిళు ్ల తీసుకొస్తున్నట్టు సమాచారం. అభివృద్ధి జరగాలంటే కొంత నష్టం జరగుకతప్పదు అన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న భవనాలు సైతం ఏజెన్సీ పరిధిలోకి వస్తాయి. అధికారులకు సర్వాధికారాలు ఉన్నప్పటికి రోడ్డు విస్తరణపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
రోడ్డు విస్తరణ చేపట్టాలి
నేషనల్ హైవేకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేయాలి. ప్రసుత్తం గుండి రోడ్డు గుండా భారీ వాహనాలు వెళ్తుండటంతో దుమ్ముధూళీతో ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు వెడల్పు పనులు చేపట్టడంతోపాటు యూనియన్ బ్యాంక్ ఎదురు గా ఉన్న మూలమలుపును పెంచా లి. ప్రజలకు ఇబ్బందులు కలుగకుం డా అధికారులు చర్యలు చేపట్టాలి.
దుర్గం దినకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కుమ్రం భీం ఆసిఫాబాద్






