వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలుచేశాం
ఆగస్టులోగా రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం
అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు
మంత్రి కొండా సురేఖ ఫైర్
వరంగల్ తూర్పు, ఏప్రిల్ 18 : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశారు. ఆగస్టులోగా రైతులకు రూ.౨లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. వరంగల్‌లో గురువారం రాత్రి జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు. రాజకీయాల్లోకి అసభ్య పదజాలం తీసుకొచ్చిందే కేసీఆర్, కేటీఆరేనని విమర్శించారు. మోదీ పాలనలో అదానీ, అంబానీ ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ దేశ ప్రజల కష్టాలను చూశారని.. ప్రజల్లో ఉండే ప్రధాని కావాలా? అదానీ, అంబానీలకు కొమ్ముకాసే వ్యక్తి కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. మద్యం కేసులో జైలుపాలైన కవితను బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ నాయకులను బీజేపీ అభ్యర్థులుగా బరిలో నిలిపారని ఆరోపించారు. శానససభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఆదరించినట్టుగానే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఆదరించి డాక్టర్ కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని చెప్పారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి, ఎంపి అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, పలువురు కార్పోరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






