calender_icon.png 21 December, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరం

21-12-2025 06:04:31 PM

- ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ప్రాధాన్యమివ్వాలి

- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి 

మంచిర్యాల,(విజయక్రాంతి): విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర పెరగడం వల్ల ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆది వారం నిర్వహించిన ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) జిల్లా విస్తృత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, కానీ అందుకు బదులుగా ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఏర్పాటు చేస్తున్న క్లాసులు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పనివ్వాలని, బోధనేతర పనుల భారం నుంచి విముక్తులను చేయాలని, ఆన్ లైన్ నివేదికలు పంపడానికి బోధనేతర సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

అలాగే రాష్ట్రంలో 45 వేల మంది, దేశ వ్యాప్తంగా 25 లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్న టెట్ పై సుప్రీం కోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం అవుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

- 28, 29 తేదీల్లో రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత సమావేశాలు...

ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ సయ్యద్ జియావుద్దీన్ ప్రాంగణం, కామ్రేడ్ రావెళ్ళ రాఘవయ్య వేదిక ( మాంగళ్య ఫంక్షన్ హాల్) లో రాష్ట్ర విద్యా సదస్సు & రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు జరుగనున్నాయని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి తెలిపారు. ఈ సభలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క అనసూయ ధనసరి, కొండా సురేఖ పాల్గొంటారన్నారు.

పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, ఎమ్మెల్యేలు రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినీ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జెఎసి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, జిల్లా  విద్యాశాఖాధికారి తదితరులు పాల్గొంటారన్నారు. అనంతరం సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు.