రాజీమార్గమే రాజమార్గం
- జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్
లక్షెట్టిపేట టౌన్,(విజయక్రాంతి): రాజీ మార్గమే రాజ మార్గమని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్, జిల్లా లీగల్ సర్వీసెస్, మండల లీగల్ సర్వీసెస్ ఆదేశాల మేరకు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో ఆయన మాట్లాడారు. చిన్న, చిన్న కేసుల్లో ఇరుక్కొని కోర్టు చుట్టూ తిరగకుండా ఈ లోక్ అదాలత్ లను వినియోగించుకోవాలని కక్షిదారులకు సూచించారు.
సయోధ్య చేసుకునే వారికి ఈ స్పెషల్ లోక్ అదాలత్ లు మంచి అవకాశమన్నారు. దీనిలో భూ తగాధ, చెక్ బౌన్స్, చిన్న చిన్న క్రిమినల్ కేసులు, 498, ఐపీసీ వంటి కేసులు రాజీకి వచ్చినట్లయితే ఇక్కడే పరిష్కారం చేసి కేసులను కొట్టివేస్తామన్నారు. ఇప్పటి వరకు 300 కేసులు రాజీకి వచ్చాయని, ఈ కేసుల పరిష్కారానికి లక్షెట్టిపేట న్యాయవాదులు, పోలీసులు సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాండ్ల సత్యనారాయణ, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.






