కరుణించిన వరుణుడు..
పునాస పంటలకు జీవం
మహబూబాబాద్, జులై 17 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరుణ దేవుడు శుక్రవారం కాస్త కరుణచూపాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో చిరుజల్లులు మొదలుకొని మోస్తారు వర్షాలు కురిసాయి. వరుణుడి కరుణ వల్ల ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అక్క డక్కడ కురిసిన జల్లులతో పునాస పంటలకు జీవం పోసిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరుతడి పంటలైన పత్తి, మొక్కజొన్న, పెసర, కంది, మినుము తదితర పంటలతో పాటు వరి సాగుకు ముందు పొలంలో నాటిన జీలుగ పంటలకు శుక్రవారం కురిసిన వర్షం కొంత మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.
పంటల సాగులో కలుపు తీవ్రత పెరిగిందని, ప్రస్తుతం కురిసిన వర్షంతో కలుపు తొలగించడానికి అనుకూలంగా మారిందని రైతులు పేర్కొంటున్నారు. వరంగల్ మహానగరంలో శుక్రవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములుగు జిల్లాలోని వాజేడు లో అత్యధికంగా 27.0 మిల్లీమీటర్ల వర్షం కురువగా, కన్నాయిగూడెం లో 18.6, మంగపేటలో 16.7, వెంకటాపురంలో 12.6, ఏటూరు నాగారంలో 9.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల లో 13.6, మలహర్ రావు మండలంలో 10.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.






