08-01-2026 01:51:16 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపుతో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే ‘బీసీ సబ్ ప్లాన్‘ చట్టం ఒక్కటే మార్గమని, దానిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో పార్టీ శ్రేణులు వినతిపత్రాలను సమర్పించాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం బడ్జెట్‌లో బీసీల కోసం కేటాయిస్తున్న నిధులు ఇతర పథకాలకు మళ్లించబడుతున్నాయి.
సబ్ ప్లాన్ చట్టం వస్తే, కేటాయించిన నిధులు కేవలం బీసీల సంక్షేమం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుం ది. ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే అవకాశం ఉండదు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో నామమాత్రపు నిధులు ఇవ్వడం అన్యాయం. ‘ఎవరి జనాభా ఎంత ఉందో.. వారికి బడ్జెట్లో అంత వాటా‘ ఉండాలనేది మా ప్రధాన డిమాండ్. ఇది చట్టబద్ధమైన సబ్ ప్లాన్ ద్వారానే సాధ్యమవుతుంది.
కుల వృత్తులపై ఆధారపడిన వారు నేడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. సబ్ ప్లాన్ నిధులతో ఈ కుల వృత్తులకు ఆధునిక యంత్రాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్య, విదేశీ విద్యానిధి, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ వంటి కార్యక్రమాలు నిరంతరాయంగా సాగాలంటే ప్రత్యేక నిధి అవసరం. తక్షణమే అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ బిల్లును ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించాలి. లేని పక్షంలో తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పల్లె పల్లె నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షులు సంపత్, వెంకటేష్ గౌడ్, రాష్ట్ర నాయ కులు పోలు రాజు, సౌత్ తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ మార్త శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ సోషల్ మీడియా కన్వీనర్ రమణ చారీ, ఉమ్మడి జిల్లా నాయకులు గరిగే జశ్వంత్, వడల రాహుల్, అరెల్లి రాము, మూతినేని సర్వేశ్వర్, గాదె సాయి తేజ, పచ్చిమట్ల అశోక్ గౌడ్, రసాల శ్రీనివాస్, బగ్గి రాజు, అడప భిక్షపతి, అడప శ్రవణ్, మంచాల పద్మ, గరిగే సుమతి, వంగరి పుష్ప, అడప ధనలక్ష్మి, బాలినే లక్ష్మి పాల్గొన్నారు.