23 March, 2026 | 4:17 AM

బడి బస్సులు భద్రమేనా?

23-03-2026 12:55 AM

నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు

విద్యార్థుల భవిష్యత్తుపై మబ్బులు

పేరు ఒకటి.. అనుమతి మరొకటి

ప్రీ ప్రైమరీలో అనధికారికత

ములుగు,మార్చి22(విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో విద్యా వ్యవస్థపై ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలే ఇప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తూ, లాభాల కోసం పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల అనే పేరుతో నడుస్తున్న ఈ వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, భద్రత అన్నీ ప్రశ్నార్థకంగా మారాయి.

పేరు ఒకటి.. అనుమతి మరొకటి..

తల్లిదండ్రుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పాఠశాలలు ఒక పేరుతో ప్రచారం చేస్తూ, మరో పేరుతో అనుమతులు పొందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం నైతిక లోపమే కాదు, చట్టపరంగా కూడా తీవ్ర ఉల్లంఘన. ఫీజులు వసూలు చేసే సమయంలో మాత్రం ఏ మాత్రం వెనుకాడకుండా, విద్యా నాణ్యత, చట్టబద్ధత విషయంలో నిర్లక్ష్యం చూపడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ప్రీ- ప్రైమరీలో అనధికారికత

ప్రభుత్వ అనుమతులు లేకుండానే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించడం మరింత ఆందోళన కలిగించే అంశం. చిన్నారుల విద్య ప్రారంభ దశలోనే ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ తరగతుల్లో చదివే పిల్లల విద్యా రికార్డులు చట్టబద్ధత కోల్పోయే అవకాశం ఉండటంతో తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది.

బస్సుల భద్రతపై పెద్ద ప్రశ్న

ఇదే సమయంలో స్కూల్ బస్సుల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా, సరైన పర్మిట్లు లేకుండా, టాక్సులు చెల్లించకుండా వాహనాలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిరోజూ పిల్లలను స్కూల్కు తీసుకెళ్లే ఈ బస్సులు, భద్రతా ప్రమాణాలను పాటించకపోతే అది నేరుగా వారి ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుంటే, ఇలాంటి నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది.

అధికారుల మౌనం..అనుమానాలకు తావు..

ఈ అన్ని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడం స్థానికుల్లో అనుమానాలను పెంచుతోంది. జిల్లా విద్యాశాఖ, రవాణా శాఖలు వెంటనే సంయుక్తంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే గుర్తింపును రద్దు చేయడం వంటి చర్యలు కూడా తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.