మహిళా సంక్షేమానికి పెద్దపీట
మహబూబాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తెలిపారు. జిల్లాలోని కురవి మండలం కందికొండ, కొత్తూరు (సి) గ్రామాల్లో నిర్మించనున్న మహిళా గ్రామైక్య సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇవ్వడంతో పాటు మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం పెట్రోల్ పంపులు, బస్సులు, సోలార్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ అప్పగిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించి, మహిళలు కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు.






