24 April, 2026 | 1:50 AM

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు : కలెక్టర్ స్నేహా శబరీష్

24-04-2026 12:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): చదువుతూనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులకు చదివే లక్ష్యం కావాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నరసింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పేరెంట్స్, టీచర్ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదేనని, చదువుతో పాటు క్రీడలు, నైతిక విలువలు కూడా నేర్పించాలని కోరారు. స్కూల్ లో ఉన్న సౌకర్యలను, విద్య బోధనను చూసి, ప్రైవేట్ స్కూల్ లో చదివే విద్యార్థులను ఈ స్కూల్ లో చేర్పించడం శుభపరిణామనీ, ఆదర్శభావాలతో పిల్లలను పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలలో మాక్ పార్లమెంట్ నిర్వహించడం బాగుందని, ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థుల ను అభినందించి మెమెంటోలు అందజేశారు. మండల ప్రత్యేక అధికారి శ్రీమన్నా రాయణ రెడ్డి, ఎంఈఓ, ఎంపీడీఓ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు  పాల్గొన్నారు.