ఇటుక వాహనాన్ని ఢీకొట్టిన బస్సు
టైర్ బ్లాస్ట్ అయి వాహనం బోల్తా
స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు
రాజేంద్రనగర్, మే 26 : టైర్ బ్లాస్ట్ అయి నడి రోడ్డుపై ఇటుక వాహనం బోల్తా కొట్టింది. అనంతరం, ఇటుక వాహనాన్ని తప్పించబోయి అటువైపుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ సంఘటన ఆదివారం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై ఎక్సిట్ నెంబర్ 17 వద్ద తెల్లవారుజామున టీఎస్07యూఎన్22674 వాహనం ఇటుక లోడ్‌తో వెళ్తుండగా ప్రమాదవశాత్తు టైర్ బ్లాస్ట్ అయ్యింది.
ఈ క్రమంలో ఆ వాహనాన్ని తప్పించబోయిన ఓ ప్రైవేట్ బస్సు (ఎన్‌ఎల్01బీ2941) ఓ కారు, ఆటో, డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రైవేట్ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






