‘దీనబాంధవుడి’కి ఢిల్లీ నుంచి పిలుపు
తాలెల్మ సంజీవులుకు దక్కిన చాన్స్
ఆందోల్, ఫిబ్రవరి- 7 : మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలుగు సాహితీ కళాపీఠం, అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక, ఆదిలీల ఫౌండేషన్ సంయుక్త అధ్వర్యంలో ఈ నెల 8,9 తేదీల్లో డిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించనున్న కవిసమ్మేళనం, అష్టావధానం, అజరామరం పద్యనాటకం సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అందోలు మండల పరిధిలోని తాలెల్మ గ్రామానికి చెందిన ప్రథమశ్రేణి తెలుగు భాషోపాధ్యాయులు (జిపఉపా చౌటకూరు మండలం సుల్తాన్ పూర్) సంజీవులు డిల్లీ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అరుదైన అవకాశం దక్కింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సంజీవులు శుక్రవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బీఆర్ అంబేద్కర్ సంకల్పంతో తాను రాసిన పద్యరచనలు దీనబాంధవుడు శీర్షికన కవి సమ్మేళనానికి ఎన్నిక కాబడినవని తెలియపరిచారు.
ప్రస్తుత సమాజంలో విద్య చాలా అవసరమని అందులో అంతరించిపోతున్న తెలుగు భాష పట్ల విద్యార్థులకు ఆసక్తి కనబరిచేందుకుగాను అనేక పద్యాలు, వ్యాసాలు, మహనీయుల జీవిత చరిత్రలు విద్యరూపంలో అందించడం, హస్తినలో తెలుగు సాహితీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం పలకడం ఎంతో సంతోషదాయకమన్నారు. తనకు తోడ్పాటు నందించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, తనకు సహకరించిన ప్రతి విద్యార్థికి తన అండదండలు ఉంటాయని తెలిపారు.




