ప్రేక్షకులు కామెడీని చూసే విధానం మారింది
అల్లరి నరేశ్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’తో అలరించబోతున్నారు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios), హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేశ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. “-సాధారణంగా సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు.
కానీ ఇందులో రంభ, ఊర్వశి, మేనక స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది. రంభ, ఊర్వశి, మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. తనది కష్టపడకుండా హీరో అయిపోవాలనే క్యారెక్టర్. దేవతలు దీవిస్తే నెక్స్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. తన ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకంలో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంటుంది.
హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ, ఊర్వశి, మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది కథ. ప్రేక్షకులు నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. సీజీ వర్క్ పరంగా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందని మొదలుపెట్టాం. ఇందులో -నాది అందరి దగ్గర అప్పులు చేసే క్యారెక్టర్. తనని ఎవరు ఊర్లో నమ్మరు. తనకు చాలా కష్టాలు వస్తుంటాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రేక్షకులు కామెడీని చూసే విధానం మారింది. నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే కామెడీని డైరెక్టర్ డిజైన్ చేశారు. అలాగే స్వర్గం, నరకం, ఇంద్రలోకం ఇలాంటి కథలు చూసి చాలా కాలం అయింది. కచ్చితంగా ప్రేక్షకులు, చిన్నపిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. ఒక మంచి ఎమోషన్ కూడా ఉంది.
ఈ సినిమాలో ‘ఓజీ’ సీక్వెన్స్ వచ్చినప్పుడు చూస్తే పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది. అది ఎందుకు అనేది సినిమా చూసినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. -ఈ మధ్యకాలంలో ఎక్కువ డార్క్ జోన్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులు లైట్ హార్టెడ్‌గా ఉండే కామెడీ సినిమాలు, ఎంటర్‌టైనర్స్ కోరుకుంటున్నారు. ఇకపై నేను కూడా రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా.. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేయాలని భావిస్తున్నా” అని తెలిపారు.






