నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల, మే 15 : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారంఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని,ప్రస్తుతం వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు.
డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థుల ఆశలపై ఈ పేపర్ లీకేజీ నీళ్లు చల్లినట్టైందని ఆవేదన వ్యక్తం చేశారు.పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన పారదర్శకతను నిరూపించుకోవడంలో విఫలమైందని విమర్శించారు.నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన కార్పొరేట్ విద్యా మాఫియాపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య,మండల కోశాధికారి నంగి కనకయ్య, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పొన్నబోయిన మమత,సుంకోజు రజిత, మండల కార్యవర్గ సభ్యులు ఎగుర్ల ఎల్లయ్య,గోమారపు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.






