నేరస్థులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకం
సీపీ రష్మీ పెరుమాళ్
‘సిద్దిపేట సురక్ష నేత్ర’ మూడో విడత ప్రారంభం
కమిషనరేట్ వ్యాప్తంగా 275 సీసీ కెమెరాల ఏర్పాటు
సిద్దిపేట క్రైం, మే 15: శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని, నేరస్థులను గుర్తించి పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. ప్రజల రక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా పోలీస్ కమిషనర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’సిద్దిపేట సురక్ష నేత్ర’ మూడో విడత కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
కమిషనరేట్ పరిధిలోని 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 275 నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. మొదటి, రెండో విడతల్లో 356 కెమెరాలు ఏర్పాటు కాగా, ఇప్పటివరకు మొత్తం 631 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. నాలుగో విడతలో మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సిద్ధిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సోలార్ సీసీ కెమెరాలు, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 19 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ స్వయంగా ప్రారంభించారు.
అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను స్వీకరించారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. తమ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సిద్దిపేట ప్రజలకు సీపీ విజ్ఞప్తి చేశారు.
శనిగరం, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో...
కమిషనరేట్ పరిధిలోని కోహెడ మండలం శనిగరం గ్రామంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ 30 సీసీ కెమెరాలను ప్రారంభించగా, చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో అదనపు డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్ 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు. మిగిలిన 22 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయా పోలీస్ అధికారులు సీసీ కెమెరాలను ఏకకాలంలో ప్రారంభించారు.






