calender_icon.png 1 August, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపాలి

31-07-2025 12:00:00 AM

  1. రాష్ట్ర సరిహద్దులో నిఘా కట్టుదిట్టం చేయాలి
  2. నేరాన్ని చేధించడం కంటే నిరోధించడం ముఖ్యం
  3. మల్టీ జోన్-2 ఇంచార్జి ఐజీ తఫ్సీర్ ఇక్బాల్

సంగారెడ్డి, జూలై 30(విజయక్రాంతి): జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని మల్టీజోన్-2 ఇంచార్జి ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.

అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం, పోలీసు పరేడ్ గ్రౌండ్, మోటార్ వెహికల్ కార్యాలయాన్ని పరిశీలించారు. జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు, రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉండటం వలన పొరుగు రాష్ట్రాల నుండి ప్రభుత్వ నిషేధిత గంజాయి, పొగాకు, గుట్కా వంటివి అక్రమ రవాణా జరగటానికి అవకాశం ఉన్నందున వాహనాల తనిఖీ పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. 

జిల్లాలో గంజాయి పండించినా, అక్రమ రవాణా చేస్తున్నట్లుగాని, మట్కా, పేకాట ఆడుతున్నట్లుగాని గుర్తించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్హెచ్వోలకు సూచించారు. పాత నేరస్తులను గుర్తించాలని, గుర్తించబడిన నేరస్తుల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. జరిగిన నేరాన్ని ఛేదించడం కంటే, నేరం జరగకుండా నిరోధించడం చాలా ముఖ్యమన్నారు. వృత్తిపరంగా ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు ఉన్నత అధికారులచే గుర్తింపు లభిస్తుందన్నారు.

మారుతున్న సమాజానికి అనుగుణంగా పోలీసింగ్ లో మార్పులు తీసుకురావాలని, సిబ్బంది ప్రతి ఒక్కరు కంప్యూటర్ పరిజ్ఞానంపై దృష్టి సారించాలని అన్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల దృష్ట్యా తమ తమ ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎలక్షన్స్ సజావుగా జరగడానికి కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. 

గత ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిని, పాత నేరస్తులని గుర్తించి ముందస్తూగా బైండ్ ఓవర్ చేయాలని చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యను నివారించడంలో సిగ్నల్స్ ఏర్పాటు, సిసి కెమెరాల ఏర్పాటు చేయడంలో జిల్లా ఎస్పీ చేస్తున్న కృషి, జిల్లా యంత్రాంగం పనితీరు అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎ.సంజీవ రావు, డిటిసి అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెరు డీఎస్పీ  ప్రభాకర్, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, డిటిసి డీఎస్పీ సురేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, ఎఆర్ డీఎస్పీ నరేందర్, జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్-ఇన్స్పెక్టర్స్, ఆర్.ఐలు రామారావు, రాజశేఖర్, డానియెల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.