ఇంద్రేశంలో ‘కుక్కల’ రాజ్యం!
- వీధుల్లోకి రావాలంటేనే వణుకుతున్న జనం
- గుంపులుగా దాడులు చేస్తున్నా పట్టింపేది ?
- పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
పటాన్చెరు, జూన్ 17 : ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్త్వ్రరవిహారం చేస్తు న్నాయి. మున్సిపల్ పరిధిలోని 60 ఫీట్లు, 40 ఫీట్ల రహదారి వెంట ఉన్న కాలనీలలో పలుమార్లు కుక్కల దాడిలో పలువురు గా యాలపాలయ్యారు. ఉదయం వాకింగ్ వెళ్ళే వారిపై, ద్విచక్ర వాహనాలతో వెళ్తున్న వారి పై దాడి చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా కుక్కలు తిరగడంతో కాలనీల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రధాన కూడళ్లు, అంతర్గత వీధుల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుక్కలు గుంపులు గా తిరుగుతున్నాయి. కాలనీ రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వృద్ధులు, మహిళలు, ముఖ్యం గా చిన్న పిల్లలను టార్గెట్ చేస్తూ ఇవి దాడులకు తెగబడుతున్నాయి. రాత్రి వేళల్లో బైక్లపై వెళ్లే వాహనదారులను కుక్కలు వెంబడించడం వల్ల భయాందోళనతో వేగంగా వెళ్లబోయి కిందపడి తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల అమలు ఎక్కడ?
విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రజలు ఎక్కువగా తిరిగే బహిరంగ ప్రదేశాల నుండి వీధి కుక్కల బెడదను నివారించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కుక్కలను చంపడం చట్టవిరుద్ధం కాబట్టి, వాటి సంఖ్యను అదుపు చేయడానికి యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో కలిసి అధికారులు వెంటనే ఇంద్రేశం కాలనీలలో ప్రత్యేక వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ డ్రైవ్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.






