16 May, 2026 | 2:09 AM

ఓపీఎస్ కోసం ఉద్యోగుల నిరీక్షణ!

16-05-2026 12:00 AM

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ని రద్దు చేయాలని రాష్ట్రంలోని సుమారు రెండున్నర లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు చాలా కాలంగా మొరపెట్టుకుంటున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైరయ్యాక పెన్షన్ ఎంత వస్తుందో తెలియకపోవడం, కనీస పెన్షన్‌కి కూడా గ్యారెంటీ లేకపోవడం వంటి సహేతుకమైన కారణాలతో సీపీఎస్ విధానాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ సర్వీస్‌కు ప్రతిఫలంగా వృద్ధాప్యంలో హక్కుగా పొందాల్సిన పెన్షన్, పాలకుల భిక్షగా మారడం ఉద్యోగ వర్గాలకు అంతులేని ఆవేదన కలిగిస్తోంది.

సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్ల నుంచి ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రెండున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 1 జనవరి 2004 నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. జనవరి 2004 నాటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి, ఆ తర్వాత అపాయింట్‌మెంట్ ఆర్డర్ పొందిన కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఓపీఎస్‌కి అర్హులని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం 2020లో స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ మెమోలను పరిగణనలోకి తీసుకొని తమకూ ఓపీఎస్ వర్తింపజేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమా ర్లు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యాయులు హైకోర్టుని ఆశ్రయించారు. 57 నంబర్ మెమోను అమలు చేయాల్సిందేనని హైకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అమలుకు మూడు నెలల గడువు విధించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్రం లో అర్హులకు ఓపీఎస్ వర్తింపజేస్తారని అందరూ భావించారు.

హైకోర్టు ఉత్తర్వుల అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఈ నెల 5న జేఏసీతో జరిగిన చర్చల సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ, సీఎం హామీ ఇచ్చిన రోజే హైకోర్టు తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో అధికారులు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది.

అధికారుల చర్యలపై టీఆర్టీఎఫ్ సహా అన్ని ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ప్రభుత్వాన్ని ఎలా విశ్వసించాలని ప్రశ్నించాయి. విస్తృతస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిపి, హైకోర్టు ఉత్తర్వులను రాష్ట్రంలో సత్వరం అమలు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులు మొరపెట్టుకుంటున్నా, సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తే ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరగడం ఖాయం. అందుకే ముఖ్యమంత్రి ఈ విషయంలో సత్వరం చొరవ చూపి న్యాయం చేయాలి. 

వ్యాసకర్త: టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, 9848481028

-మానేటి ప్రతాప రెడ్డి