03-08-2025 12:00:00 AM
అడవుల జిల్లాగా, ఆదివాసీల జిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడేలలో శ్రావణమాసపు సందడి నెలకొంది. తమ పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయలను ఆచరిస్తూ వాటిని ఈ మాసంలో ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఆటవిడుపుగా జరుపుకునే మారుగోళ్లు(కర్రలపై నడవడం ) ఆటను ఈ మాసంలో ఘనంగా జరుపుకుంటారు.
చుక్కల అమావాస్య నుంచి పోలాల అమావాస్య వరకు ఖోడంగ్ లేదా భోడంగ్( గుర్రాల ఆట) వేడుకలను నిర్వహిస్తారు. దీంతో జిల్లాలోని మారుమూల ఆదివాసీ గూడెల్లో పండగ వాతావరణం నెలకొంది. ఆఫ్రికాలోని ఇథియోపియా తదితర దేశాల్లోనూ అక్కడి ఆదిమవాసులు కర్రలపై నడవటం ఆటను ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఒకదానికొకటి సుదూరంలో ఉన్నప్పటికీ ఆఫ్రికా, ఇండియా(తెలంగాణ)లలో ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఎందుకు పాటిస్తున్నారో అర్థం కానప్పటికీ..
పూర్వకాలంలో అందరం ఒకటిగానే ఉండవచ్చనే అభిప్రాయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వ్యక్తపరుస్తున్నారు. కర్రలపై నడినే విధానాన్నిన చూడడానికి ఇథియోపియా దేశానికి విదేశీ పర్యాటకులు ప్రత్యేకంగా వస్తుంటారు. అలాగే తెలంగాణలోకూడా ఈ ఆటను ఆడే ఆదివాసీ పల్లెలను పర్యాటక ప్రదేశాలుగా మార్చితే మనకు విదేశీ మారకద్రవ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే అవకాశం లభిస్తుంది.
ఖోడంగ్ లేదా గుర్రాల ఆట
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో, ముఖ్యంగా ఆదివాసీ గూడల్లో మారుగోళ్లు (కర్రలపై నడవడం) ఆటకు ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పలు ఆదివాసీ గూడల్లో ప్రత్యేకమైన, వింత గొలిపే ఆచారం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ఆదివాసీలు తమ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీఠ వేస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తూ వాటిని భావితరాలకు అందిస్తున్నారు.
ఆదివాసీలు ఏ పండుగ జరుపుకున్నా, ఏ వేడుక చేసుకున్నా ఎంతో నియమ నిష్టలతో ఆచరిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు శ్రావణ మాసంలో జరుపుకునే పండుగ ఖోడంగ్. గోండి భాషలో దీన్ని భోడంగ్‌గా పిలుస్తారు. దీన్నే మారుగోళ్లు లేదా గుర్రాల ఆట అని కూడా అంటారు. ప్రస్తుతం జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో ఈ ఖోడంగ్ వేడుకల సందడి నెలకొంది.
చుక్కల అమావాస్య నుంచి పోలాల అమావాస్య వరకు దాదాపు నెల రోజుల పాటు గిరిపల్లెల్లో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చూడటానికి వింతగా కనిపించే ఈ ఆచారం వెనుక ఎంతో పరమార్థం దాగి ఉండటంతో పాటు అపరిశుభ్రత నుంచి రక్షణ కోసం సైన్స్ కూడా దాగి ఉంది. ప్రస్తుతం ఈ ఖోడంగ్ ఆటతో చిన్నారులు గూడలో సందడి చేస్తున్నారు.
ఖోడంగ్ పండుగ ఎలా జరువుకుంటారు
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు జరుపుకునే ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం గిరిజన గూడాల్లో జరుపుకుంటున్న ఈ ఖోడంగ్ పండుగలో కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ భోడంగ్ పండుగకు ముందు ఆదివాసీ గిరిజనులు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి వనదేవతలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తారు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో అటవీ ప్రాంతం నుంచి వెదురు బొంగులను వెంట తీసుకువస్తారు.
అలా తెచ్చిన వెదురు బొంగులతో మారుగోళ్లను తయారు చేస్తారు. నిలువుగా పొడవుగా ఉన్న 2 వెదురు బొంగులపై నిటారుగా నిలబడేలా కొద్దిగా ఎత్తులో అడ్డంగా రెండు చిన్న వెదురు బొంగు ముక్కలను కట్టి తయారు చేస్తారు. వాటిపై కాళ్లు పెట్టి నిలబడి వాటి సహయంతో అటు ఇటు నడుస్తారు. మారుగోళ్ల పై నిలబడి బ్యాలెన్స్ తప్పకుండా అటు ఇటు చకచకా నడుస్తుంటే చూసిన వారికి ఆశ్చర్యం కలుగక మానదు.
ఈ పండగ వెనుక దాగి ఉన్న పరమార్థం
అయితే ఈ ఖోడంగ్ పండగ ఆట వెనుక ఓ పరమార్థం ఉంది. సాధారణంగా వానాకాలం వర్షాలతో గిరిజన గూడాల్లో రోడ్లు చిత్తడిగా మారిపోతుంటాయి. కింద అంత బురదమయంగా మారి నడవడానికి ఇబ్బందిగా మారడం, ఆ బురడలో నడవటం వల్ల అంటూ వ్యాధులు ప్రబలడం, కాలికి పుండ్లు అయ్యేవి. ఈ సమస్యను అధిగమించడానికి పూర్వీకులు ఇలా వెదురు బొంగులతో మారుగొళ్లను తయారు చేసుకొని కాలికి బురద అంటకుండా వీటితో నడిచే వారు.
ఇదే ఆచారాన్ని ఇక్కడి గిరిజనులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పోలాల అమావాస్య మరుసటి రోజు ఈ మారుగోళ్లన్నింటిని ఊరి పొలిమేరలో ఏదైన ఆలయం వద్ద విడిచిపెట్టి వస్తారు. అప్పటివరకు ఈ ఆచారం కొనసాగుతుంది. అయితే ఈ ఆటను ఎక్కువగా గూడాల్లో ఉండే పిల్లలు ఆడతారని, ప్రస్తుతం అందరు కూడా హాస్టళ్లలో ఉండి చదువుకోవడం వల్ల గ్రామాల్లో ఆడటం తగ్గుతు వస్తోంది.
రాను రాను కనుమరుగయ్యే ప్రమాదం ఉండని పలువురు ఆదివాసీ పెద్దలు పేర్కొంటున్నారు. ఇలాంటి సంప్రదాయాలను పరిరక్షించి భావి తరాలకు అందజేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఆదిలాబాద్, విజయక్రాంతి