calender_icon.png 12 August, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికే దిక్సూచిగా విత్తన చట్టం

03-08-2025 12:00:00 AM

  1. విత్తన చట్టానికి తుది మెరుగులు!

రూపుదిద్దుకుంటోన్న ముసాయిదా

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే విత్తన చట్టం

రైతుకు అండగా రూపొందుతోన్న ముసాయిదా

ఇతర రాష్ట్రాల్లోను రైతు కమిషన్ అధ్యయనం

నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులతో రైతులు మోసపోతే.. వారికి విత్తన కంపె నీల నుంచే నష్టపరిహారం.. అక్కడితోనే ఆగకుండా జరిమానా, జైలు శిక్ష పడుతుంది.. నష్టపరిహారం విషయంలో ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా చెల్లించేలా నిబంధనలు.. పంట సీజన్ పూర్తికాలం అయ్యాక నష్టం అయినట్లు గుర్తిస్తే.. 100 శాతం నష్టపరిహరం వచ్చేలా చర్యలు.. ఇదంతా ఏమనుకుంటున్నారు..

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా సిద్ధం చేస్తున్న విత్తన చట్టం ముసాయిదాలో పొందుపర్చుతున్న కొన్ని నిబంధనలు. ఇతర రాష్ర్టంలో అమల్లో ఉన్న విత్తన చట్టం లోపాలను గ్రహించి తెలంగాణలో బలమైన సమగ్రమైన విత్తన చట్టం వుండాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రాబోతున్న విత్తన చట్టం ముసాయిదా తుది మెరుగులు దిద్దుకుంటోంది. రైతులను మోసం చేసేది ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందిస్తున్నారు. 

100 శాతం నష్టపరిహారం 

పంట కాలం పూర్తి అయిందంటే.. పెట్టుబడి, సీజన్, రైతు కష్టం దృష్టిలో పెట్టుకోని 100 శాతం నష్టపరిహారం అందించేలా చట్టం రూపొందిస్తున్నారు. పంట కాలం మధ్యలో నష్టం వాటిల్లినట్లు తేలితే.. 50 శాతం, విత్తనాలు వేసిన మొదట్లో అయితే.. 10 నుండి 20 శాతం నష్టపరిహారం అందేలా చర్యలు వుండనున్నాయి.

ఇక తెలంగాణ విత్తన చట్టం ద్వారా తెలంగాణ రైతాంగం ధైర్యంగా వ్యవసాయం చేసేలా వుండాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా వ్యవసాయ కమిషన్, విత్తన కమిటీ మూసాయిదాను రూపొందిస్తుంది. ప్రస్తుతం విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

దేశానికే రోల్ మోడల్‌గా

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న విత్తన చట్టం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విత్తన చట్టం బిల్లు తీసుకొచ్చే పనిలో రాష్ర్ట ప్రభుత్వం నిమగ్నమైంది. రైతు కమిషన్ పర్యవేక్షణలో విత్తన చట్టం ముసాయిదా రూపుదిద్దుకుంటుంది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి డైరెక్షన్‌లో విత్తన చట్టం కమిటీ పనిచేస్తోంది.

విత్తన చట్టంలో ఉండాల్సిన అంశాలపై ఇప్పటికే పలు సూచనలు, సలహాలను కమిషన్ చైర్మన్ సూచించారు. విత్తన చట్టం ముసాయిదా తయారు చేయడానికి ఇప్పటికే విత్తన కమిటి.. రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలను కూడా సేకరించింది. వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో కూడా సమీక్ష సమావేశాలను నిర్వహించింది. రైతులు, రైతు సంఘాల నేతలు, డీలర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యవరణ వేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు,  విత్తన కంపెనీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించింది.

స్టడీ టూర్‌పై విత్తన కమిటి, రైతు కమిషన్ చైర్మన్ హర్యానాకు వెళ్లి వచ్చారు. అక్కడ పర్యటించి రైతుల నుంచి స్థానికంగా అమలవుతున్న విత్తన చట్టంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో విత్తన చట్టాలు, విధానాలను విత్తన కమిటీ అధ్యయనం చేసింది.తెలంగాణలో రాబోతున్న విత్తన చట్టం దేశానికే దిక్సూచిగా వుండాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిశానిర్ధేశం చేయడంతో.. విత్తన చట్టం ముసాయిదా మొత్తం కమిషన్ చైర్మన్ దగ్గరుండి చూస్తున్నారు.

 హైదరాబాద్, విజయక్రాంతి