11 July, 2026 | 1:52 AM

సైబరాబాద్ పోలీసుల స్వర్ణాంకిత విజయం

11-07-2026 12:22 AM

-37 పతకాలతో చరిత్ర సృష్టించిన క్లస్టర్ -ఏ 

శేరిలింగంపల్లి, జూలై 10 (విజయక్రాంతి): విధుల మధ్య గడిచే రోజుల్లోనూ క్రీడా స్ఫూర్తిని చైతన్యంగా నిలుపుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్రీడాకారులు మరోసారి తమ సత్తా చాటారు. రాష్ట్రస్థాయి 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ స్పోరట్స్ మీట్-2026లో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన తీవ్ర పోటీల్లో క్లస్టర్-ఏ జట్టు 37 పతకాలతో అద్భుత విజయం సాధించి అందరినీ అలరించింది.

9 స్వర్ణ, 8 రజత, 20 కాంస్య పతకాలతో మొత్తం 37 పతకాలు కైవసం చేసుకుని కమిషనరేట్ కీర్తి పతాకాన్ని ఎగరేసిన ఈ జట్టు ప్రదర్శన పోలీసు శాఖలో క్రీడా సంస్కృతి ఎంతగా పాతుకుపోయిందో చెప్పే స్పష్టమైన ఉదాహరణ.యోగా,ఆర్మ్ రెజ్లింగ్, వుషు, తైక్వాండో, బాక్సింగ్, కరాటే, జిమ్నాస్టిక్స్, పెన్చక్ సిలాట్, పవర్లిఫ్టింగ్, బాడీబిల్డింగ్ వంటి వివిధ క్రీడా విభాగాల్లో సైబరాబాద్ అథ్లెట్లు తమ బహుముఖ ప్రతిభను రుజువు చేశారు. ఈ విజయం సాధించిన క్రీడాకారులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్ శుక్రవారం కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సత్కరించారు. విజేతలకు శాలువాలు వేసి, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉంటూ, కఠినమైన విధులను నిర్వహిస్తూనే క్రమబద్ధమైన సాధనతో ఈ స్థాయి విజయాలు సాధించడం నిజంగా అభినందనీయం. ఈ క్రీడా స్ఫూర్తిని ముందుకు కొనసాగించి జాతీయ స్థాయిలో కూడా సైబరాబాద్ పోలీసుల సత్తా చాటాలని వారిని ప్రోత్సహించారు.రాబోయే రోజుల్లో క్రీడాకారులకు అన్ని రకాల అధునాతన సౌకర్యాలు, శిక్షణా వసతులు కల్పిస్తామని సీపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్, డీసీపీలు టి. అన్నపూర్ణ, సుధీంద్ర, పుష్ప, సంజీవ్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని విజేతలను అభినందించారు.