గిరిజన తండాల రోడ్లకు మహర్దశ
-రహదారుల మరమ్మతులకు 700 కోట్లు
-కేసీఆర్ కుటుంబ తగాదాల్లో మమ్మల్ని లాగొద్దు
-కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నరు
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పష్టీకరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): గిరిజన తండాల్లో రోడ్ల మరమ్మ తులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపా రు. ఇటీవల వచ్చిన వరదలతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో రోడ్లు దెబ్బతిన్నాయని, 429 గిరిజన అవాసాలకు రూ. 700 కోట్ల తో రోడ్ల నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.
మంగళవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని 236 శివారు గ్రామాల రోడ్లకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా నిధులు మంజురయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో గిరిజన తండాలను పట్టించుకోలేదని విమర్శించారు.
గిరిజన తండాల అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ నుంచి సస్పెన్షన్ వ్యవహారం కేసీఆర్ కుటుంబ సమస్య అని, ఆ తగాదాలను కవితనే చూసుకోవాలని మంత్రి సూచించారు. కుటుంబ పంచాయితీలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని లాగడం సరికాదని హితవు పలికారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కవిత పరోక్షంగా అంగీకరించారని ఆయన చెప్పారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేయడం లేదని, ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది కాబట్టే సీబీఐ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. హరీశ్‌రావు, సంతోష్‌రావుల వెనక ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు.






